Idream media
Idream media
పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహకందని విధంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు రావడంతో చంద్రబాబులో ఫ్రస్టేషన్ పీక్ స్టేజికి వెళ్లింది. తొలి విడతలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 2,637 పంచాయతీల్లో విజయం సాధించారు. మొత్తంగా 81.16 శాతం పంచాయతీలను వైసీపీ మద్ధతుదారులు కైవసం చేసుకోవడంతో బాబు అంచనాలు తలకిందులయ్యాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో సహాయంతో..ఏకగీవ్రాలు ఎక్కువగా కాకుండా చూసినా.. ఎన్నికల ఫలితాల్లో మాత్రం వైసీపీ హవా నడిచింది. ఇదే ఇప్పుడు చంద్రబాబులో అసహనానికి దారి తీసింది.
కొద్దిసేపటి క్రితం మీడియతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వంపై, వైసీపీపై, పోలీసులు, అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని, పోలీసులు టెర్రర్ సృష్టించారని మండిపడ్డారు. పీలేరు, మాచర్ల నియోజకవర్గాలతోపాటు బలవంతంగా జరిగిన ఏకగ్రీవాలపై కోర్టులకు వెళతామన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఓట్లు వేయకుండా ఉండేలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా పని చేయకపోతే.. ప్రజలు తీర్పు ఇచ్చేలా పరిస్థితి ఉండాలన్నారు. ప్రజా స్వామ్యం చిన్నబోయిందని, వైసీపీ పతనం ప్రారంభమైందని జోస్యం చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏమైనా పెద్ద నాయకుడా..? అంటూ ఆవేశంతో ఊగిపోయారు. తొలి విడతలో టీడీపీకి 38.74 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. రాత్రింభవళ్లు అరిచినా.. తమను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
చేతిలో అధికారం ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా.. మిన్నుకుండిపోయిన చంద్రబాబు ఇప్పుడు గగ్గోలు పెట్టడడం చూస్తున్న వారికి విడ్డూరంగా తోస్తోంది. 2018 ఆగస్టులో పంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పంచాయతీ ఎన్నికలపై నోరు మెదపలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. వ్యతిరేక ముందే బయటపడుతుందనే భయంతో పంచాయతీలను ప్రత్యేక అధికారుల పాలనలో పెట్టారు. క్షేత్రస్థాయిలో టీడీపీ బలంపై స్పష్టత ఉన్నా.. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలతో గెలిచిందంటూ గగ్గోలు పెట్టడం బాబు తరహా రాజకీయానికి నిదర్శనంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజా తీర్పును గౌరవించడం చంద్రబాబుకు ఎన్నడూ అలవాటు లేదు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనా.. ఎందుకు ఓడిపోయానో తెలియదంటూ ఇప్పటికీ బుకాయిస్తున్న చంద్రబాబు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తారని ఆశించడం పొరపాటవుతుంది.