iDreamPost
android-app
ios-app

pakka commercial review పక్కా కమర్షియల్ రివ్యూ

  • Published Jul 01, 2022 | 1:55 PM Updated Updated Jul 01, 2022 | 3:28 PM
pakka commercial review పక్కా కమర్షియల్ రివ్యూ

ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ ని అనుభవించిన గోపీచంద్ కు పెద్దగా చెప్పుకునే హిట్టు వచ్చి చాలా కాలమయ్యింది. వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఏది తన స్థాయిలో లేక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఈ క్రమంలో మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న మారుతీతో జట్టు కట్టడంతో అభిమానుల్లో ఆశలు రేగాయి. టైటిల్ లోనే క్లియర్ గా జానర్ చెప్పేయడంతో రణం నాటి పెర్ఫార్మన్స్ ని మరోసారి చూడొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూశారు. దానికి తగ్గట్టే ప్రోమోలు, చిరంజీవిని పిలుచుకొచ్చి చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు వైబ్రేషన్లు పాజిటివ్ గానే అనిపించాయి. ఓపెనింగ్స్ కొంత వీక్ గా ఉన్నప్పటికీ టాక్ నే నమ్ముకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

విక్కీ(గోపీచంద్) డబ్బుల కోసం ఏ కేసునైనా వాదించే కమర్షియల్ లాయర్. ఓ అమ్మాయికి న్యాయం చేయలేదని నిజాయితీ కోసం పాతికేళ్ల క్రితం జడ్జ్ పదవిని వదిలేసిన తండ్రి(సత్యరాజ్) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయనకు తెలియకుండా దందా నడిపిస్తుంటాడు. ఈ క్రమంలో బిజినెస్ మెన్ వివేక్(రావు రమేష్)తో పరిచయమవుతుంది. అతని తరఫున వకాల్తా పుచ్చుకుని కొన్ని కేసుల నుంచి బయట పడేసి ఆ గ్యాంగ్ లో కీలక సభ్యుడిగా మారతాడు. దీంతో తండ్రికొడుకుల మధ్య స్వంత ఇంట్లోనే అగాధం వచ్చి పడుతుంది. ఇంతకీ విక్కీ ఇంత అన్యాయంగా ఎందుకు మారాడు. ఈ వ్యవహారానికి శిరీష(రాశిఖన్నా)కున్న సంబంధం ఏంటనేది తెరమీద చూడాలి

నటీనటులు

రెండు దశాబ్దాలు దాటినా గోపీచంద్ లో అదే ఎనర్జీ ఉంది. సరిగా వాడుకునే దర్శకుడు దొరక్క ఇన్నేళ్లు వృధా అయ్యాడు, ఇంకా అవుతున్నాడు. పక్కా కమర్షియల్ తనకు సూటయ్యే సబ్జెక్టే. అందులో డౌట్ లేదు. తన నుంచి ఏం ఆశించారో దానికి పూర్తి న్యాయం చేకూర్చాడు. ఫైట్లలో ఎప్పటిలాగే తన మార్కు కనిపిస్తుంది. బరువైన ఎమోషన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోయింది కాబట్టి కామెడీతో లాగించేశాడు. రాశిఖన్నాకు మరోసారి చలాకీ పాత్ర దక్కింది. అందంతో పాటు అభినయం పరంగానూ మెప్పించింది. ఇద్దరి జోడి ఆల్రెడీ జిల్ లో చూశాం కాబట్టి ఫ్రెష్ గా అనిపించకపోయినా స్క్రీన్ మీద ఇద్దరూ బాగున్నారనిపించారు.

రావు రమేష్ ది రొటీన్ క్యారెక్టరే. ఫ్రెంచ్ స్టైల్ లో చిన్న గెడ్డం పెట్టి ఏదో కొత్తగా చూపిద్దామనుకున్నారు కానీ అదేమంత స్పెషల్ గా అనిపించదు. కాకపోతే తన టైమింగ్ తో చాలా సీన్స్ ని నిలబెట్టారు. అజయ్ ఘోష్ కొన్ని నవ్వులకు ఉపయోగపడ్డారు. సప్తగిరి, వైవా హర్షల కామెడీ మిస్ ఫైర్ అయ్యింది. కేవలం ఒక్క సన్నివేశం కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసుకొచ్చారు. సియాది మలుపు తిప్పే పాత్రే కానీ అదీ ఈ గోలలో ఏమంత ఎఫెక్టివ్ గా అనిపించదు. శ్రీనివాసరెడ్డి, జయలలిత, శుభలేఖ సుధాకర్, రఘు తదితరులు ఫిల్లింగ్ కి పనికొచ్చారు. సత్యరాజ్ మరోసారి తన హుందాతనంతో హీరో తండ్రిగా నటనతో తన ఉనికిని చాటుకున్నారు.

డైరెక్టర్ అండ్ టీమ్

గత సినిమాలు చూస్తే ఏ పాయింట్ అయినా దాన్ని నవ్విస్తూ చెప్పాలనే మారుతీ స్టైల్ బాగుంటుంది. కానీ సబ్జెక్టులో ఉన్న డెప్త్ కు తగ్గట్టు దానికీ కొన్ని పరిమితులు అవసరం. వాటిని చెరిపేసి టైం పాస్ చేయిస్తున్నా కదా ఇంకేం ఆలోచించకండని చెబితే ఎవరు వింటారు. పక్కా కమర్షియల్ ని లైన్ గా చెప్పుకుంటే ఎస్ బాగానే ఉంది కదానిపిస్తుంది. వర్కౌట్ చేయొచ్చనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక సిన్సియర్ రిటైర్డ్ జడ్జ్ కి, క్రిమినల్ ఆలోచనలున్న లాయర్ కొడుక్కి మధ్య సంఘర్షణగా దీన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన మంచిదే. కానీ దాన్ని పేపర్ పై మార్చే క్రమంలో క్వాలిటీ కామెడీని జోడించే ప్రాసెస్ లో జరిగిన తడబాటు ఫైనల్ గా దెబ్బేసింది.

హీరో చిన్నప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్, నాన్నకు విలన్ అన్యాయం చేయడం, దానికి రివెంజ్ గా మన కథానాయకుడు అతని గ్యాంగ్ లోనే చేరడం ఇప్పటికి కొన్ని వందల సార్లు చూసుంటాం. గోపీచంద్ కావాలనే తప్పుడు కేసులు వాదించడం వెనుక కారణాన్ని రెగ్యులర్ తెలుగు సినిమాలు చూసే ఎవడైనా ఈజీగా గెస్ చేస్తాడు. అలాంటప్పుడు కనీసం ఇంటర్వెల్ తర్వాతైనా తన పాత్రను పాజిటివ్ వైపు తిప్పాల్సింది. కానీ అదేదో పెద్ద ట్విస్టులా చివరి పావు గంట ముందు ఓపెన్ చేయడంతో అసలు హీరో సత్యరాజా అనిపించేలా స్క్రీన్ ప్లే సాగడం ముమ్మాటికీ రాతలోని లోపమే. పైగా అత్తెసరు జోకులతో జబర్దస్త్ జమానాలో నవ్వించడం కష్టమని గుర్తుపెట్టుకోవాలి.

సత్యరాజ్ వైపు స్టోరీని అంత ఎమోషనల్ గా సెట్ చేసుకున్న మారుతీ మిగిలిన వ్యవహారమంతా మరీ సిల్లీగా మార్చేశారు. పోనీ ఆయన లాయర్ కోట్ తిరిగి వేసుకున్నప్పుడైనా ట్విస్టులు పండాలి. కానీ అవేం ఉండవు. అక్కడ తండ్రి కొడుకు కోడలు మధ్య ఓ వెరైటీ పాట పెట్టేసి దాన్నే క్రియేటివిటీ అనుకోమన్నారు. సత్యరాజ్ మళ్ళీ కోర్టుకు వచ్చినప్పుడు బోలెడంత డ్రామా ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ పదే పదే గోపిచంద్ రావురమేష్ వైపే ఉన్నట్టు రిజిస్టర్ చేయాలని తాపత్రయపడిన ఎపిసోడ్లు అవసరానికి మించి సాగతీతకు గురయ్యాయి. అసలు విషయం తెలిసిపోయింది కదా ఇంకేదైనా మారుతీ థ్రిల్ చేస్తారేమో అని చూస్తే అదేం జరగదు. చప్పగా వెళ్ళిపోతుంది.

అప్పుడెప్పుడో శైలజారెడ్డి అల్లుడులో చేసిన పొరపాట్లు మారుతీ ఇందులో ఇంకొంచెం పెద్దగా చేశారు. అందుకే క్యాస్టింగ్ ఎంతున్నా కూడా ఉపయోగపడలేదు. అతడులో మహేష్ బాబు కిల్లర్ గా పరిచయమవుతాడు. ఓ గంట ముగిసేలోపు మంచోడిగా ఫీలవుతాం. టెంపర్, పటాస్ లో హీరోలు లంచాల కోసం దేనికైనా తెగించే బాపతులా చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్ లో విలన్ చేసే దుర్మార్గాల మీద వాళ్లే తిరగబడి మనతో విజిల్స్ వేయించుకుంటారు. కానీ పక్కా కమర్షియల్ లో విక్కీ ఎంతసేపటికీ ఇలా చేయకపోవడంతో మాస్ ఆడియన్స్ మెప్పు పొందే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. క్లైమాక్స్ ట్విస్టు ముందే ఊహిస్తాం కాబట్టి అక్కడా థ్రిల్ మూమెంట్స్ ఉండవు.

టైటిల్ కమర్షియల్ అని పెట్టాం కదాని ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ పోతే ప్రేక్షకులు గుడ్డిగా ఆదరించే రోజులు కావివి. దర్శకుడు మారుతీ బలం ఎంటర్ టైన్మెంట్. కథలో ఎంత సీరియస్ నెస్ ఉన్నా దానికి కామెడీ టచ్ చేసి ఆడియన్స్ ని మెప్పించడంలో ప్రత్యేకత కలిగినవాడు. అందుకే భలే భలే మగాడివోయ్ అంత పెద్ద హిట్టయ్యింది. తండ్రి చావు మీద హాస్యం పండించినా ప్రతి రోజు పండగే సూపర్ పాస్ అయ్యింది. కానీ రాను రాను తనలో మేజిక్ స్పార్క్ తగ్గుతోంది. మంచి రోజులు వచ్చాయితోనే జనం హెచ్చరించారు. కానీ మారుతీ తిరిగి అదే టెంప్లేట్ కంటిన్యూ చేశారు. లాటరీ తగలకపోదా అనే తరహాలో స్క్రిప్ట్ రాసుకున్నారనే అనుమానం కల్గుతుంది.

థియేటర్ కు వచ్చే పబ్లిక్ ని టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. అసలే టికెట్ రేట్ల దెబ్బకు, ఓటిటిల దూకుడుకి కంటెంట్ లో సత్తా ఉంటే తప్ప టికెట్లు తెగడం లేదు. పబ్లిసిటీ గిమ్మిక్కులు మహా అయితే మార్నింగ్ షోలు నింపొచ్చేమో కానీ అసలైన రన్ తెచ్చేది మాత్రం సినిమాలో విషయమే. త్వరలో ప్రభాస్, చిరంజీవి లాంటి బిగ్ లీగ్ స్టార్లను డీల్ చేయబోతున్న మారుతీ మరింత అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఈ పక్కా కమర్షియల్ నొక్కి చెబుతుంది. మంచి రోజులు వచ్చాయి వార్నింగ్ బెల్ అనుకుంటే ఇప్పుడీ సినిమా దానికి ఫైనల్ కాల్ గా చెప్పుకోవచ్చు. సోసో ఫన్ తో మీడియం రేంజ్ హీరోలతో మార్కెట్ ని గెలవడం కష్టం

సినిమాకున్న అతి పెద్ద మైనస్ సంగీతమే. ఒక్క పాట కనీసం ఇంకోసారి యూట్యూబ్ లో విందాం చూద్దాం అనిపించేలా ఉండదు. జేక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే. కర్మ్ చావ్లా ఛాయాగ్రహణం బాగుంది. వంకలేం లేవు. ఉద్దవ్ ఎడిటింగ్ ని ల్యాగ్ కి కారణమని చెప్పలేం. సంభాషణలు అక్కడక్కడా పేలాయి కానీ మళ్ళీ తలుచుకుని చూసే రేంజ్ లో లేవు. బన్నీ వాస్, ఎస్కెఎన్ నిర్మాణ విలువలు ఓకే. సబ్జెక్టు డిమాండ్ కు తగ్గట్టు అవసరమైనంతా ఖర్చు పెట్టారు. గీత ఆర్ట్స్ 2లో ఇదే పెద్ద సినిమాని చెప్పొచ్చు

ప్లస్ గా అనిపించేవి

గోపీచంద్ ఎనర్జీ
సత్యరాజ్ పాత్ర
అక్కడక్కడా కామెడీ

మైనస్ గా తోచేవి

సంగీతం
సిల్లీ నెరేషన్
ఓవర్ ది బోర్డ్ లాజిక్స్
ఎమోషనల్ కనెక్షన్

కంక్లూజన్

హీరోని లాయర్ గా పెట్టి కోర్టు రూమ్ డ్రామాలు ఎలా పండించాలో బాలీవుడ్ లో వచ్చిన ఎల్ఎల్బి 2 మంచి ఉదాహరణ. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ దాన్ని పోషించిన తీరు, దర్శకుడు పండించిన ఎమోషన్స్, బాలన్స్ చేసిన ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకుల చప్పట్లు అందుకున్నాయి. ఫోకస్ సరిగా పెట్టి ఉంటే ఈ పక్కా కమర్షియల్ కూడా ఆ స్థాయిలో పండేది. కానీ డెప్త్ కు, కామెడీకి, ఎమోషన్ కు మధ్య జరిగిన యుద్ధంలో నలిగిపోయి చివరికి యావరేజ్ మెట్టు దగ్గరే కేసు ఓడిపోయింది. గోపీచంద్ కోసమైతే ఒక్కసారైనా చూస్తాం అనుకునే వాళ్ళకు పెద్ద డిజప్పోయింట్ మెంట్ ఉండకపోవచ్చేమో కానీ సగటు ప్రేక్షకులు మాత్రం పక్కా పైసా వసూల్ అనుకోలేరు

ఒక్క మాటలో – కేసు గెలవలేదు

రేటింగ్ : 2.5 / 5