iDreamPost
android-app
ios-app

Andhra Pradesh: పదివేలకు పైగా టీచర్లకు ప్రమోషన్స్, 700 కొత్త పోస్టులు

Andhra Pradesh: పదివేలకు పైగా టీచర్లకు ప్రమోషన్స్, 700 కొత్త పోస్టులు

ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న గవర్నమెంట్ టీచర్లకు తీపి కబురు! పది వేల మందికి పైగా ఉపాధ్యాయులను డిప్యూటీ DEOలు, MEOలు, హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయడానికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన ఫౌండేషనల్ స్కూళ్ళలో సబ్జెక్టుల బోధనకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం.        దీంతో SGTలలో అర్హులైనవారికి SAలుగా పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి YS జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకే పాఠశాల విద్యాశాఖ 7 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనుంది. అలాగే రాష్ట్రంలో 500 హెడ్మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇక మండల విద్యాధికారుల పోస్టులు మొత్తం 666 ఉండగా, 421 మంది మాత్రమే పని చేస్తున్నారు. అయితే ఈ పోస్టులు తమవేనని, వీటిని జడ్పీ స్కూళ్ళకు కేటాయించరాదని ప్రభుత్వ స్కూల్ టీచర్లు కొన్ని దశాబ్దాలుగా వాదిస్తున్నారు. దీంతో ప్రతి మండలానికి ఇద్దరేసి MEOలు ఉండేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో MEO పోస్టులు డబులై 1,332కి చేరాయి. వీటిలో 666 పోస్టులను ప్రభుత్వ స్కూల్ టీచర్లకు మరో 666 పోస్టులు జడ్పీ స్కూల్ టీచర్లకు కేటాయించారు. అర్హులైన హెడ్మాస్టర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 53 డిప్యూటీ DEOల నియమాకంపైనా ప్రభుత్వ, జడ్పీ టీచర్ల మధ్య వివాదం కొనసాగుతోంది. సీఎం జగన్ ఈ ఖాళీల భర్తీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదనంగా 36 డిప్యూటీ DEO పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 89 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. వీటితో పాటు మున్సిపల్ టీచర్లకూ ప్రమోషన్స్ లభించనున్నాయి. ప్రమోషన్స్ ప్రక్రియ ముగిశాక టీచర్ల సాధారణ బదిలీలు కూడా జరుగుతాయి. అలాగే వేల మంది టీచర్లు 22 ఏళ్ళ నుంచి సబ్జెక్టు మార్పు కోసం దరఖాస్తు చేసుకుంటూ వచ్చారు. ఈ సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో పాఠశాల విద్యా శాఖ ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.  దీని వల్ల 2,300 టీచర్లకు లబ్ధి చేకూరుతుంది.