Idream media
Idream media
జట్కా బండ్లని రిక్షాలు తినేశాయి. ఆటోల చేతిలో రిక్షాలు పోయాయి. క్యాబ్‌ల దెబ్బకి ఆటోలు విలవిల. ఇదంతా ఒక చక్రం.
నాటకాన్ని సినిమా తినేసింది. సినిమాని తినే కొత్త శక్తి ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటూ ఉంది. ఇది సినిమానే కాదు, టీవీని కూడా ఎంతోకొంత కబళిస్తోంది. దాని పేరు OTT (Over The Top) .
ఇదీ డిజిటల్ ప్లాట్‌ఫామ్.
గ్రామాల్లోకి ఇంకా పాకలేదు కానీ, పట్టణాల్లో ఉన్నవాళ్లందరికీ NETFLIX , Amazon Prime అంటే తెలుసు. Hotstar, Z5, Sony ఇంకా చాలా పేర్లతో OTT వస్తోంది.
వెబ్ సిరీస్ హిందీలో సూపర్‌హిట్ అయ్యాయి. పెద్దపెద్ద సినిమా నటులంతా దీని వెంట పడ్డారు. కెరీర్ అయిపోయిందనుకున్న సైఫ్ ఆలీఖాన్, మనోజ్‌బాజ్ పాయి మళ్లీ లేచి నిలబడ్డారు.
తెలుగు వాళ్లు ఇప్పుడిప్పుడే దీని వెంట పడుతున్నారు. గ్యాంగస్టర్స్ , భజన బ్యాచ్ (ఐ డ్రీమ్స్ ప్రొడక్షన్) స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. అల్లు అరవింద్ ఒక భారీ ప్రాజెక్టుకి ప్లాన్ చేశాడు. కనీసం 10 వెబ్‌సిరీస్ నిర్మించే ప్రయత్నంలో బోలెడు కసరత్తు చేయిస్తున్నారు.
వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏమంటే దీనికి సెన్సార్ లేదు. బూతుల ప్లేస్‌లో బీఫ్‌లు ఉండవు. హింస కూడా ఒక రేంజ్‌లో ఉంటుంది. (మీర్జాపూర్, సేక్రెడ్‌గేమ్స్) అన్నింటికి మించి టాలెంట్‌ని చూపించుకోవాలంటే ఇదో లాంచింగ్ ప్యాడ్. ప్రతిభ ఉంటే పేరు కూడా తొందరగా వస్తుంది. టీవీ సీరియల్‌లాగా ఏళ్ల తరబడి ఉండదు. ఇప్పుడు ఆడిషన్స్‌కి కాల్ చేస్తే webseriesకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మన దేశంలో webseries క్రెడిట్ అంతా రిలయన్స్‌కే దక్కుతుంది. జియో తర్వాతే ఫోన్‌లో నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ చూస్తున్న ప్రేక్షకుల్లో 80 శాతం మంది ఫోన్ వీక్షకులే! రెండేళ్లలో ప్రేక్షకుల శాతం 200కి పెరిగిందంటే దానికి Smart phones కారణం.
ఇప్పటికైతే ధరలు తక్కువే ఉన్నాయి. NETFLIX రూ.599 నెలకి చార్జ్ చేస్తుంది. Hotstar చాలా తక్కువ ధరలకి ఇచ్చే ప్రయత్నంలో ఉంది.
చిన్న నటులకి పెద్ద అవకాశం, పెద్ద నటులకి మరింత పెద్ద అవకాశాలు కల్పిస్తున్న OTT త్వరలోనే సినిమాలని కబళిస్తుంది. ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలకి తప్ప మామూలు సినిమాలకి థియేటర్‌లకి వెళ్లడం మానేశారు. అమెజాన్‌లో వస్తే చూద్దామనుకుంటున్నారు. ఇదే జరిగితే మరిన్ని థియేటర్లు మూతపడతాయి.