iDreamPost
iDreamPost
కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూతబడిన నేపథ్యంలో ఇండస్ట్రీ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితిలో ఓటిటి సంస్థలు మరోసారి తమ ప్లానింగ్ ని వేగవంతం చేశాయి. ఇప్పుడు అందరి చూపు మే 13 మీదే ఉంది. మొట్టమొదటిసారి ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రాధే థియేటర్లో డిజిటల్ లో డిటిహెచ్ లో ఒకేసారి రిలీజ్ కావడం పట్ల ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మోడల్ ఎంతమేరకు వర్కౌట్ అవుతుందనే పెద్ద ప్రశ్న రేకెత్తిస్తోంది. టికెట్ ధర 299 రూపాయలు పెట్టడం పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. అంతే ఖర్చు పెట్టి చిన్నితెరపై చూస్తారా అనే అనుమానాలు లేకపోలేదు.
కానీ జీ ఆలోచన వేరుగా ఉంది. రాధే లాంటి సినిమాను ఫ్యామిలీ మొత్తం థియేటర్ కు వెళ్లి చూడాలంటే ఎంత లేదన్నా టికెట్లకే కనీసం వెయ్యి రూపాయలు కావాలి. పైగా ఇతర ఖర్చులు అదనం. అలాంటిది ఎక్కడికి వెళ్లే అవసరం లేకుండా నేరుగా ఇంట్లో చూసే అవకాశం కలిగిస్తునప్పుడు 299 రూపాయలు పెద్ద మొత్తం కాదనేది వాళ్ళ వెర్షన్. ఇదంతా ఎందుకు అనుకుంటే జీ5కి ఏడాది చందా కట్టేస్తే ఫ్రీగా చూసే వెసులుబాటు కూడా కలిగిస్తారట. సో ఫస్ట్ డే లెక్కలు ఇక్కడ చాలా కీలకంగా మారబోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో హాళ్లు తెరిచే సూచనలు ఇప్పట్లో లేవు కాబట్టి జీ ఆశిస్తున్న రెవిన్యూ ఎంత వస్తుందో చూడాలి
ఒకవేళ ఈ స్ట్రాటజీ సక్సెస్ అయితే మాత్రం మిగిలినవాళ్లు కూడా ఇదే దారి పడతారు. గతంలో ఖాలీపీలి, కెపే రణసింగం కూడా జీ సంస్థ ఇదే తరహాలో 150 రూపాయలు టికెట్ పెట్టి రిలీజ్ చేసింది. రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. కాకపోతే పైరసీ ప్రభావం గట్టిగా పడటంతో లెక్కల్లో తేడా వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు రాధేకు కూడా ఈ గండం ఉంది. దశాబ్దాల తరబడి పైరసీ భూతాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ఇప్పుడేదో ఆఘమేఘాల మీద ప్రభుత్వాలు దీని దృష్టి పెట్టడం అసాధ్యం. మరి రాధే కనక తన మీద పెట్టిన పెట్టుబడిని కనక వెనక్కు తీసుకొస్తే సౌత్ లోనూ ఈ తరహా థియేటర్ కం ఓటిటి రిలీజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి