iDreamPost
android-app
ios-app

వీడియో: వ్యక్తిని కుక్కలా మార్చి రోడ్డుపై తిప్పుతూ..

వీడియో: వ్యక్తిని కుక్కలా మార్చి రోడ్డుపై తిప్పుతూ..

ప్రస్తుత సమాజంలో కొంతమంది కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించడం లేదు. తోటి వ్యక్తులను మనుషుల్లా చూడకపోగా.. మనుషుల్లా కూడా బతకనివ్వడం లేదు. తాజాగా వెలుగు చూసిన అలాంటి ఒక ఘటన సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఒక యువకుడిని కుక్కలా అరవాలంటూ ఆదేశించడమే కాకుండా.. అతని మెడలో తాడుని కూడా కట్టి రోడ్డుపై లాక్కెళ్లారు. ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఈ అమానవీయ ఘటనపై నెటిజన్స్ మాత్రే కాకుండా.. హోంమంత్రి కూడా స్పందించారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలంటూ ఆదేశించారు.

ఈ అమానుష, అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో వెలుగు చూసింది. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక గుంపు ఒక యువకుడిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అతని మెడలో ఒక తాడు కట్టి గట్టి పట్టుకుని రోడ్డుపై కుక్కలాగా ఈడ్చుకెళ్తున్నారు. అతడిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. “సాహిత్ నా తండ్రి, సాహిత్ నా అన్నలాంటి వాడు” అంటూ బాధితుడు కేకలు వేస్తున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.

తాము ఇలాంటి భావజాలాన్ని, ప్రవర్తనను సహించబోమంటూ హెచ్చరించారు. నిందితులను 24 గంటల్లోగా పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై బాధితుడి తరఫు కటుంబం, బంధువులు కూడా స్పందించారు. తమ వ్యక్తికి మద్యం, మాంసం అలవాటు చేశారని.. సొతం ఇంట్లోనే దొంగతనం చేసేలా తయారు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే ఫిర్యాదు తీసుకోలేదంటూ ఆరోపించారు. వీడియో వైరల్ అయిన తర్వాతే చర్యలకు ఉపక్రమించారంటూ వెల్లడించారు.