iDreamPost
android-app
ios-app

ట్రక్కు బీభత్సం: 55 మంది మృతి- 30 మందికి గాయాలు!

ట్రక్కు బీభత్సం: 55 మంది మృతి- 30 మందికి గాయాలు!

తెలిసి జరిగినా.. తెలియక జరిగినా రోడ్డు ప్రమాదం వల్ల ఎన్నో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడపడం, అనుకోని ప్రమాదాలు ఇలా కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బైక్, స్కూటర్ లాంటి వల్ల ప్రమాదం జరిగితే నష్టం తక్కువగానే ఉంటుంది. కానీ, బస్- లారీ- ట్రక్ వంటి వాటి వల్ల ప్రమాదం జరిగితే నష్టం కూడా అంతే పెద్ద మొత్తంలో ఉంటుంది.

తాజాగా ఓ ట్రక్కు అదుపుతప్పడం వల్ల ఏకంగా 55 మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన పశ్చిమ కెన్యా ప్రాంతంలో జరిగింది. ఒక ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా ఉన్న వాహనాలు, రద్దీగా ఉండే ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 55 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. 30 మంది వరకు గాయపడినట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది, స్థానికులు అంతా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

వాహనాల కింద చిక్కుకున్న వారి కోసం, మృతదేహాల కోసం గాలించారు. గాయాలపాలైన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. అదుపుతప్పిన ట్రక్కు 8 వాహనాలు, కొన్ని ద్విచక్రవాహనాల పైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రద్దీగా ఉన్న మార్కెట్ లోకి దూసుకెళ్లింది. అక్కడే ఉండి ప్రాణాలు కాపాడుకున్న వారంతా తాము ఎంతో అదృష్టవంతులం అంటూ చెప్పుకొచ్చారు. మృత్యువుని చాలా దగ్గరగా చూశామన్నారు.