iDreamPost
android-app
ios-app

కారడవిలో తండ్రి శవం పక్కనే.. రాత్రం ఏడుస్తూ కూర్చున్న మూడేళ్ల బాలుడు!

కారడవిలో తండ్రి శవం పక్కనే.. రాత్రం ఏడుస్తూ కూర్చున్న మూడేళ్ల బాలుడు!

నిత్యం మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, వార్తలు చదువుతూ ఉంటాం. కానీ, కొన్ని మాత్రం మన హృదయాలను ద్రవింపజేస్తాయి. ఆ కోవకు చెందిందే ఇప్పుడు చెప్పుకబోయే వార్త. ఒక మూడేళ్ల బాలుడు రాత్రంతా అడవిలో.. తండ్రి శవం పక్కనే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయాడు. నాన్నకు ఏమైందో తెలీదు, ఎందుకు లేవడంలేదో తెలీదు. తండ్రి శవం పక్కనే రాత్రంతా పడుకుని నిద్రపోయాడు. ఈ విషాదకర ఘటన ఎంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇందల్ వాయి మండలం, వెంగల్ పాడు గ్రామానికి చెందిన మాలవత్ రెడ్డి.. తన మూడేళ్ల కుమారుడితో కలిసి జూన్ 21న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. యాచారం నుంచి అదేరోజు రాత్రి ఇంటికి తిరుగు పయనమయ్యాడు. అతను దగ్గి అటవీ ప్రాంతం మీదుగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి రాగానే అతని బైకు ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై బ్యారికేడ్ ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో మాలవత్ రెడ్డి గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అటవీప్రాంతం కావడంతో ఎవరూ వీరిని గుర్తించలేదు. తండ్రిని లేపందుకు బాలుడు ఎంతో ప్రయత్నించాడు. నాన్నా లే అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ, ఎంతకీ తండ్రి లేవకపోవడంతో అక్కడే నిద్రపోయాడు. తెల్లవారుజామున అక్కడ ఉండే గుడికి వచ్చిన పూజారి.. బాలుడిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి వెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రమాదం గురించి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకి వివరించారు. వారికి ఆర్థిక సహాయం చేస్తామంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాలుడు రాత్రి సమయంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే విషయం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.