iDreamPost
android-app
ios-app

మందులతో పీరియడ్స్ వాయిదా వేస్తున్నారా? డేంజర్‌లో ఉన్నట్టే!

మందులతో పీరియడ్స్ వాయిదా వేస్తున్నారా? డేంజర్‌లో ఉన్నట్టే!

మహిళలు ప్రతి నెల వచ్చే పీరియడ్స్ సమయంలో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆ సమయంలో విపరీతమైన రక్తస్రావం కావడం వల్ల అలసట, శారీరక బాధలకు తోడు మానసిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఏ పని చేయాలని అనిపించదు. ఇక ఆఫీసులకు వెళ్లాలన్నా, ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా చిరాకు వస్తూ ఉంటుంది. కొంత మంది మహిళల్లో నెలసరి ప్రభావం విపరీతంగా ఉంటుంది. విపరీతమైన కడుపులో నొప్పి రావడం, తల తిరగడం, వాంతులు, వికారం వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. అంతేకాకుండా మరికొంత మందిలో ఎక్కువగా బ్లడ్ పోవడం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల రుతు క్రమంలో నానా అవస్థలు పడుతుంటారు. హార్మోన్లు సమతుల్యం లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వారి ఆరోగ్యాన్ని మరింత కఠినతరం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో కొంత మంది మందులు తీసుకుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే కొంత మంది వివిధ కారణాలతో పీరియడ్స్ వాయిదా వేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఫంక్షన్స్, వేడుకలు ఉన్నాయని, వారం రోజుల పాటు బంధువు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని, గుడులకు లేదా తీర్థ యాత్రలకు వెళ్లాల్సి రావడంతో ఎవ్వరినీ ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో కొంత మంది మహిళలు పీరియడ్స్‌ను పోస్టు పోన్ చేస్తూ మెడిసన్స్ తీసుకుంటుంటారు. పీరియడ్స్ తేదీ కన్నా రెండు రోజుల ముందు నుండి మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి అయితే పర్వాలేదు కానీ పదేపదే కనుక నెలసరిని వాయిదా వేస్తూ ఉంటే మాత్రం మెడిసన్స్ తీసుకుంటే మీరు డేంజర్‌లో ఉన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.

అత్యధికంగా ఈ మందులు తీసుకోవడం వల్ల హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ ఏర్పడతాయని, దీని వల్ల రెగ్యులర్ పీరియడ్స్ మిస్ అయ్యే చాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. మాత్రలు తీసుకుంటే గర్భసంచిలో మార్పులు చోటుచేసుకుంటాయని, రక్తంలో గడ్డలు కట్టే అవకాశాలు ఉన్నాయని, దీని ద్వారా గర్భస్థ సమస్యలు వస్తాయని తెలిపారు. పీరియడ్స్ ను బలవంతంగా ఆపుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వెల్లడించారు. మెడిసన్స్ ను ఎలా పడితే అలా తీసుకోకూడదని, వైద్యుల సలహా మేరకు వాటిని వినియోగించాలని సూచిస్తున్నారు. రక్త హీనత ఉన్న మహిళలు, గుండె , లివర్, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ మందులకు దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఆ సమయంలో సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.  ఎక్కువ ఇబ్బంది కలిగిస్తే వైద్యులను సంపద్రించాలని పేర్కొంటున్నారు.