iDreamPost
iDreamPost
సినీ పరిశ్రమలో ఎందరో గురుశిష్యులు ఉంటారు. కానీ కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలిచిపోతారు. దర్శకరత్న దాసరినారాయణరావు ఆర్ నారాయణమూర్తి బంధం గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న పీపుల్స్ స్టార్ ని చేరదీసి చిన్నదో పెద్దదో వేషాలు ఇవ్వడమే కాదు నలుగురికి రికమండ్ చేసి మరీ దాసరి తన శిష్యుడికి అండగా నిలబడ్డారు. 1988 అర్ధరాత్రి స్వతంత్రంతో నారాయణమూర్తి సోలో హీరోగా దర్శకుడిగా స్థిరపడిపోయినప్పటికీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావడానికి ఏడేళ్లు పట్టింది. అది కూడా బ్లాక్ బస్టర్ కావడం ఇద్దరి అభిమానులకు కలిగించిన ఆనందం చిన్నది కాదు.
1995లో దాసరి తారకప్రభు ఫిలిమ్స్ కాకుండా తన పేరు మీద ఫిలిం యూనివర్సిటీ అనే బ్యానర్ నెలకొల్పి నిర్మాణాలు ప్రారంభించారు. దీనికి ముందు ఆయన దర్శకత్వం వహించిన మాయాబజార్, కొండపల్లి రత్తయ్య, నాన్నగారు ఆశించిన విజయాలు సాదించలేదు. అదే సమయంలో అప్పటికే తొమ్మిది సినిమాలు పూర్తి చేసిన నారాయణమూర్తి తనతో సినిమా చేయమని స్వయంగా కోరడంతో ఒరేయ్ రిక్షాకు శ్రీకారం పడింది. ఇప్పుడంటే క్యాబులు, రాపిడో బైకులంటూ తిరుగుతున్నాం కానీ ఒకప్పుడు మనిషే ఇంజిన్ లా మారి నడిపించిన రిక్షాలే రవాణా వ్యవస్థలో కీలకంగా ఉండేవి. ఈ పాయింట్ కి రాజకీయంలోని అనిశ్చితిని, యువతలో పెరుగుతున్న తిరుగుబాటు ధోరణిని జొప్పించారు దాసరి. సంజీవి సంభాషణలు సమకూర్చగా రమణరాజు ఛాయాగ్రహణం అందించారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.
బ్రహ్మానందం, బాబూమోహన్, రఘునాధరెడ్డి, రవళి, వేలు, నర్రా వెంకటేశ్వర రావు తదితరులు ప్రధాన తారాగణం. ఓ రాజకీయ నాయకుడి మాటలు గుడ్డిగా నమ్మి తన వర్గం వాళ్ళు దగాపడ్డాక జ్ఞానోదయం కలిగే రిక్షావాలా సూర్యం పాత్రలో నారాయణమూర్తి విశ్వరూపం చూపించారు. సిస్టర్ సెంటిమెంట్ తో గద్దర్ రాసిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ’ పాట క్లాసు మాస్ తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. రాసిన ప్రజాగాయకుడికి పాడిన వందేమాతరం శ్రీనివాస్ ఇద్దరికీ నంది అవార్డులు తెచ్చిపెట్టింది. 1995 నవంబర్ 9న రిలీజైన ఒరేయ్ రిక్షా అంచనాలను మించి ఆడి సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అదే ఏడాది డిసెంబర్ 14న విడుదలైన చిరంజీవి రిక్షావోడు డిజాస్టర్ కావడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ. ఎప్పుడైనా కంటెంటే కింగ్ మరి.
Also Read : Super Star & Mega Star : చిరంజీవి రజనీకాంత్ స్నేహితులుగా సినిమా – Nostalgia