iDreamPost
android-app
ios-app

ఆర్డినెన్సుతో ఆశానువాహులకు అందలం

ఆర్డినెన్సుతో ఆశానువాహులకు అందలం

నగర మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ పోస్టులపై ఆశలు పెట్టుకుని, అవి అందకపోవడంతో నిరుత్సాహంలో ఉన్న ఆశానువాహులకు శుభవార్త. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండో వైస్‌ చైర్మన్‌ నియమించాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఫైల్‌కు గవర్నర్‌ ఆమోద ముద్ర పడడంతో.. ఆర్డినెన్స్‌ జారీ అయింది. దీంతో ఇకపై కార్పొరేషన్లలో మేయర్‌తోపాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్‌తోపాటు ఇద్దరు వైస్‌ చైర్మన్లు ఉండబోతున్నారు.

ఈ నెల 11వ తేదీన 12 నగరపాలక సంస్థలు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఏలూరు నగరపాలక సంస్థ మినహా మిగతా నగర, పట్టణ సంస్థల ఫలితాలు 14వ తేదీన వెల్లడయ్యాయి. తాడిపత్రి మున్సిపాలిటీ మినహా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను వైసీపీ భారీ మెజారిటీలతో దక్కించుకుంది. ఈ నెల 18వ తేదీన మేయర్, చైర్మన్ల ఎన్నిక జరిగింది. అదే సమయంలో పలు చోట్ల వైస్‌ చైర్మన్ల ఎన్నిక పూర్తయింది. రెండో డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్‌ ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ రాక ఆలస్యం కావడంతో.. నాడు రెండో డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగలేదు. తాజాగా ఆర్డినెన్స్‌ జారీ కావడంతో.. ఈ ప్రక్రియకు లైన్‌ క్లియర్‌ అయింది. 

మేయర్, చైర్మన్‌ పోస్టులు, డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్ల పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. అయితే వివిధ సమీకరణాల నేపథ్యంలో మేయర్, చైర్మన్‌ పోస్టులు దక్కని వారికి డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్‌ పోస్టులు లభించే అవకాశం తాజగా ఏర్పడింది.

Also Read : మున్సిపల్‌ ఎన్నికలు.. నాడు– నేడు.. ఎంత వ్యత్యాసం..?

ఇప్పటికే చట్టసభల్లో సభ్యులుగా ఉన్న వారు, వివిధ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి వారసులకు మున్సిపల్‌ ఎన్నికలకు దూరంగా ఉంచాలని వైసీపీ నిర్ణయించింది. అయితే పలు చోట్ల స్థానిక కారణాల వల్ల కొంత మంది పోటీ చేసి కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచారు. ముందుగా అనుకున్న ప్రకారం వీరిని మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు అధికార పార్టీ దూరంగా ఉంచింది. తిరుపతిలో భూమన కరుణాకర్‌ రెడ్డి కుమారుడు డిప్యూటీ మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నా.. నెరవేరలేదు. అయితే స్థానిక కారణాలు, భవిష్యత్‌ రాజకీయ అవకాశాల నేపథ్యంలో విజయనగరంలో మాత్రం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి కుమార్తెకు విజయనగరం డిప్యూటీ మేయర్‌ పోస్టు దక్కింది. ఒకట్రెండు చోట్ల మినహా.. అన్ని నగర , పట్టణ సంస్థల్లో పదవులు ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు లభించిన వారికే దక్కబోతున్నాయి.

11 మేయర్, 75 చైర్మన్‌ పోస్టులకు గాను రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం అంటే.. 43 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ(మైనారిటీ సహా) దక్కాల్సి ఉండగా.. వైసీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసేలా గొప్ప నిర్ణయం తీసుకుంది. 86 పోస్టులకు గాను ఏకంగా 67 పోస్టులు (77.91 శాతం) పోస్టులను వారికి కేటాయించారు. ఓసీలకు 19 పోస్టులు (22.09 శాతం) మేయర్, చైర్మన్‌ పోస్టులు దక్కాయి. తాజాగా వచ్చి వెలుసుబాటుతో ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో రెండో డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్‌లను నియమించే అవకాశం వచ్చింది. ఇది మేయర్, చైర్మన్‌ పోస్టులు ఆశించి భంగపడిన వారికి డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్‌ పోస్టులు దక్కబోతున్నాయి.

ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్లు సమాన అధికారాలు ఉంటాయి. మేయర్‌ వరుసగా 15 రోజులు నగరం వెలుపల ఉన్నా, అనారోగ్యంతో విధులకు హాజరుకాలేకపోయినా.. ఆ బాధ్యతలను ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక డిప్యూటీ మేయర్‌ నిర్వర్తిస్తారు. చైర్మన్‌ పట్టణం వెలుపల వరుసగా పది రోజుల పాటు ఉన్నా.. ఆరోగ్య సమస్యలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితులలో ఉన్నా.. ఆ బాధ్యతలను వైస్‌ చైర్మన్లలో ఒకరు నిర్వర్తిస్తారు. ఇద్దరు వైస్‌ చైర్మన్లలో ఎవరు చైర్మన్‌ బాధ్యలు చూడాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చైర్మన్, మేయర్‌.. తిరిగి వచ్చిన తర్వాత ఆ బాధ్యతలను వారికి అప్పగించేలా తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పొందుపరిచింది.

Also Read : కొలువుదీరిన నగరపాలికలు.. 11 మంది మేయర్లు వీరే..