iDreamPost
android-app
ios-app

కరుణానిధి ముఖ్యమంత్రి కాలేదంటూ ప్రచారం ఎందుకు ?

  • Published Mar 21, 2021 | 8:38 AM Updated Updated Mar 21, 2021 | 8:38 AM
కరుణానిధి ముఖ్యమంత్రి కాలేదంటూ ప్రచారం ఎందుకు ?

‘కలైంజర్ ఎప్పటికీ సీఎం కాలేరు’.. అని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సెటైర్లు పేల్చుతున్నాయి. కలైంజర్ రెండు దశాబ్దాల కష్టపడినా సీఎం కాలేరంటూ ఆయన నోరు జారడం ఎన్నికల జోక్ గా మారింది. తమిళనాడులో కలైంజర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కరుణానిదే గుర్తుకొస్తారు. ఆయనకున్న బిరుదు అది. అటువంటి కరుణానిధి దివంగతులై మూడేళ్లవుతోంది. అయినా ఇప్పుడు అన్నాడీఎంకే నేతలు తమ ప్రచారంలో అలవాటుగానో.. పొరపాటుగానో లేని కరుణ పేరు స్మరిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.

కరుణ లేని తొలి ఎన్నికలు

తమిళనాట కరుణానిధి లేని రాజకీయాలను, ఎన్నికలను ఊహించలేం. పెరియార్ రామస్వామి ఆదర్శంగా.. కామరాజ్ నాడార్ శిష్యుడిగా ద్రవిడ రాజకీయాలను నడిపిన ఎంజీ రామచంద్రన్, కారుణానిధిలు తర్వాత కాలంలో వేర్వేరు పార్టీలు పెట్టి ఆరవ రాజకీయాలను శాసించారు.

అప్పటి నుంచి ప్రతి ఐదేళ్లకోసారి అన్నా డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య అధికార మార్పిడి ఆ రాష్ట్రంలో సంప్రదాయంగా మారింది. అయితే అన్నా డీఎంకే నుంచి ఎంజీఆర్.. ఆ తర్వాత జయలలిత మధ్యలో కొద్దికాలం జానకీ రామచంద్రన్ ఆ పార్టీకి నేతృత్వం వహించి.. కరుణానిధి సవాల్ చేసి ముఖ్యమంత్రులయ్యారు. కానీ కరుణానిధి మాత్రం డీఎంకే స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీ చీఫ్ గా.. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా కొన్నసాగారు. 2018లో దివంగతులయ్యే వరకు అదే ఆధిపత్యం కొనసాగించారు. 1977-89 మధ్య, తిరిగి 2011-18 మధ్యే వరుసగా రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్నారు. వయోభారం, అనారోగ్యంతో మూడేళ్ళ క్రితం ఆయన తుదిశ్వాస వదలడంతో తమిళనాడు తొలిసారి ఆయన లేని ఎన్నికలను చూస్తోంది.

ఆయన లేకున్నా.. ఆయన పేరుంది..

కరుణానిధి వారసుడిగా డీఎంకే పగ్గాలు చేపట్టిన తనయుడు స్టాలిన్ ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే కూటమికి సారథ్యం వహిస్తున్నారు. మరోవైపు జయలలిత లేని అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వం వహిస్తున్నారు. సర్వేలన్నీ డీఎంకే కూటమిదని.. పదేళ్ల తర్వాత ఆ కూటమి అధికారంలోకి రావడం తధ్యమని ఘోషిస్తున్నాయి. దాంతో ప్రస్తుత అధికార కూటమిలో ఆందోళన కనిపిస్తోంది. దీనికితోడు దశాబ్దాలుగా కరుణానిధిపై చేసిన పోరాటాలు.. ఆరోపణల కారణంగా ఏదో రూపంలో ఆయన పేరు ప్రస్తావించడానికి అలవాటు పడిపోయారు.

ఈఎన్నికల్లో ఆ అలవాటే వారిని కరుణ పేరు ఉచ్చరించేలా చేస్తోంది. మరోవైపు డీఎంకే ఎలాగూ తమ పార్టీ వ్యవస్థాపకుడి పేరు ప్రస్తావించకుండా ఉండదు. ఫలితంగా కరుణానిధి లేకపోయినా ఆయన పేరు మాత్రం ఎన్నికల ప్రచారంలో మార్మోగుతోంది.