iDreamPost
android-app
ios-app

ఆ అదృష్టం రజనీకాంత్ సినిమాకే

  • Published Sep 26, 2020 | 9:32 AM Updated Updated Sep 26, 2020 | 9:32 AM
ఆ అదృష్టం రజనీకాంత్ సినిమాకే

కోట్లాది సంగీతాభిమానులు ఆశ్రునయనాల మధ్య గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం స్వర్గానికి వెళ్లిపోయారు. అంత్యక్రియలు పూర్తి చేసుకుని అందరికీ శాశ్వత సెలవు చెప్పేశారు. ఇప్పుడాయన చిట్టచివరి పాటలు ఎవరికీ పాడారు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. గత కొన్నేళ్లుగా చాలా ఆచితూచి పాటలను ఎంచుకుంటున్న బాలు గారు ఈ ఏడాది తెలుగు సినిమాల్లో మూడు సార్లు వినిపించారు. ఎంత మంచివాడవురా, డిస్కో రాజా, పలాసలో ఒక్కో పాట పాడారు. డబ్బింగ్ సినిమా దర్బార్ లోనూ టైటిల్ ట్రాక్ బాలు గారిదే. ఇక వర్తమానానికి వస్తే రజినీకాంత్ రాబోయే సినిమా అన్నాతేలో బాలసుబ్రమణ్యం గారు ఓ పాట పాడారు.

ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. వచ్చే నెల నుంచి తిరిగి ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన రికార్డింగ్ ఇంతకు ముందే పూర్తయ్యింది. ఒకప్పుడు సూపర్ స్టార్ టైటిల్ సాంగ్స్ అన్నీ బాలసుబ్రమణ్యమే ఆలపించేవారు. అయితే ట్రెండ్ కోసమని మ్యూజిక్ డైరెక్టర్లు నవతరం గాయకులతో ప్రయత్నించినా అవి అంతగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అందుకే రోబో, పేట లాంటి సినిమాలకు మళ్ళీ బాలుని ఆశ్రయించక తప్పలేదు. కానీ ఇక్కడ మనం దురదృష్టంగా భావించాల్సింది ఏంటంటే అన్నాతే తెలుగు రికార్డింగ్ ఇంకా జరగలేదు. హక్కులకు సంబంధించి నిర్మాత ఎవరో ఇంకా తేలనందుకు అది పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు ఈ రూపంలో ఆ పాటను మన భాషలో వినే అవకాశం కోల్పోయినట్టే.

మణిశర్మ ఆచార్య కోసం ఏదైనా ట్రాక్ పాడించి ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికైతే అలాంటి సమాచారం ఏదీ లేదు. ఇస్మార్ట్ శంకర్ లోనూ మణిశర్మ అందులో ఉన్న సందర్భాలు సహకరించలేదు కాబట్టి బాలుని ఉపయోగించుకోలేకపోయారు. ఒకవేళ ఆచార్య కూడా మిస్ అయ్యుంటే మాత్రం పైన చెప్పిన మూడు సినిమాలే తెలుగు వరకు బాలసుబ్రమణ్యం గారు పాడిన ఆఖరి పాటలుగా చెప్పుకోవచ్చు. భౌతికంగా మన మధ్య లేకపోయినా నిత్యం సినిమా సంగీతం రూపంలో బాలు స్వర్గం ఎన్ని యుగాలైనా సజీవంగానే ఉంటుంది. అది కళాకారులకు మాత్రమే దక్కే గొప్ప వరం. అందులోనూ బాలసుబ్రమణ్యం లాంటి సరస్వతి పుత్రులను ఈ తరంలో పుట్టించిన దేవుడికి నిజంగానే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రాణ మిత్రుడి మరణం పట్ల రజినీకాంత్ నిన్న ఎమోషనల్ గా వీడియో సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే