iDreamPost
iDreamPost
సినిమా పరిశ్రమలో ఒక్క పెద్ద సక్సెస్ ఇచ్చే కిక్ మాములుగా ఉండదు. రేంజ్ మనం ఊహించనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. నిర్మాతలు ఇంటి ముందు క్యూ కడతారు. బ్లాంక్ చెక్కులు బ్యాంకుకు వెళ్ళమని ఊరిస్తుంటాయి. సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోయేదాకా నిరంతరం మ్రోగుతూనే ఉంటుంది. దీనికి 2021 వేదికగా నిలవడం విశేషం. జాతిరత్నాలుతో అందరి దృష్టి తనవైపే తిప్పుకునేలా చేసిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు అయిదు కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడని ఫిలిం నగర్ టాక్. అంతా ఇచ్చేనందుకు సిద్ధపడినా అందరికీ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదట. పెద్ద బ్యానర్లకు సైతం వెయిటింగ్ లిస్ట్ తప్పడం లేదట.
ఇక ఉప్పెనలో రాయణంగా విశ్వరూపం చూపించిన విజయ్ సేతుపతి డిమాండ్ కూడా అంతే స్థాయిలో ఉంది. తనతో సినిమా చేయాలంటే పది కోట్ల పారితోషికంతో తమిళనాడు థియేట్రికల్ రైట్స్ అడుగుతున్నట్టు ఓ ప్రచారం ఉంది. పుష్ప నుంచి డ్రాప్ అవ్వడానికి ఇదీ ఒక కారణమని ఫ్రెష్ అప్ డేట్. అందుకే ఫహద్ ఫాజిల్ ని తెచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ మూడు కోట్లు, కృతి శెట్టి కనీసం కోటి తీసుకునే స్థాయికి వాటి ఫలితాలు మార్కెట్ పెంచేశాయి. అసలే టాలీవుడ్ లో ఆర్టిస్టుల కొరత క్రమంగా పెరుగుతోంది. ఇలా సక్సెస్ సాధించిన వాళ్ళకు ఈ మాత్రం రేంజ్ పెరగడం ఆశ్చర్యం కాదు కానీ ఇవన్నీ కేవలం రెండు నెలల కాలంలో జరిగినవి.
వీళ్ళకే కాదు జాతిరత్నాలు, ఉప్పెన దర్శకులు బుచ్చిబాబు, అనుదీప్ ల డిమాండ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. టాలెంట్ కొరత పరిశ్రమలో ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొందరు దర్శకులేమో తమకు అందివచ్చిన అరుదైన అవకాశాలను వృధా చేసుకుంటుండగా మరోవైపు కంటెంట్ ఉంటే యాక్టర్లు ఎవరున్నా సరే బ్రహ్మరథం పడతామని ప్రేక్షకులు కలెక్షన్ల రూపంలో ఋజువు చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ఆసక్తిని పెంచుతున్న కొత్త డైరెక్టర్లు, హీరో హీరోయిన్ల మీదే ఉంది. హిట్ కొట్టడం ఆలస్యం వాళ్ళ మీద కర్చీఫ్ వేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎందరో.