పెద్దారెడ్డి కి ఎదురుదెబ్బ.. జేసీ చరిత్ర సృష్టిస్తారా..?

అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఒక్క రోజు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ నెల 8వ తేదీన తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాముల పేటలో బట్టలు, చీరలు పంచినట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదులు నిజమని ఈసీ నిర్థారించింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న కారణంగా ఈ రోజు శుక్రవారం ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

గత సాధారణ ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు షాక్‌ ఇచ్చి ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో తన కుమారుడును కౌన్సిలర్‌గా పోటీలోకి దింపారు. 36 వార్డులున్న తాడిపత్రి మున్సిపాలిటీలో చైర్మన్‌ సీటు జనరల్‌ అభ్యర్థులకు దక్కనుంది.

30వ వార్డును నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పెద్ద కుమారుడు హర్షవర్థన్‌రెడ్డిని రంగంలోకి దించారు. ఆయన గెలిస్తే చైర్మన్‌ అయ్యే అవకాశాలున్నాయి. అయితే గత ఎన్నికల్లో తన కుమారుడు అశ్వథ్‌ను ఓడించిన పెద్దారెడ్డిపై రగిలిపోతున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఈ ఎన్నికల్లో పెద్దారెడ్డి కుమారుడును ఓడించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా పని చేసిన ప్రభాకర్‌ రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసి సంచలనం సృష్టించారు. 30వ వార్డులో పెద్దారెడ్డి కుమారుడు, జేపీ ప్రభాకర్‌ రెడ్డికి మధ్య ఆసక్తికర పోరు సాగనుంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబం మళ్లీ యూటర్న్‌ తీసుకోవడం వెనుక పెద్దారెడ్డి కుమారుడు కౌన్సిలర్‌గా పోటీ చేయడమే. హర్షవర్థన్‌రెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ అవకుండా అడ్డుకునేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగారు. మరి గత ఎన్నికల నాటి పరాభవానికి జేసీ కుటుంబం ప్రతీకారం తీర్చుకుంటుందా..? లేదా కౌన్సిలర్‌గా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేగా జే సీ ప్రభాకర్‌రెడ్డి చరిత్ర సృష్టిస్తారా..? వేచి చూడాలి.

Show comments