Idream media
Idream media
గ్రామ స్వరాజ్యానికి గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వచనంగా మారాయి. ప్రజలకు తమ ఊరిలోనే ప్రభుత్వ సేవలు అందించాలన్న మహాత్మా గాంధీ కలలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయాలు ప్రజలకు ఉన్నతమైన, సత్వర సేవలను అందిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున లాంఛనంగా ప్రారంభమైన సచివాలయ వ్యవస్థ ఏడాది కాలంలోనే కోటి వినతులను పరిష్కరించి సరికొత్త రికార్డును సృష్టించాయి.
గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభమైనది గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ అయినా.. ఉద్యోగుల భర్తీ, మౌలిక వసతుల కల్పన అనంతరం ప్రజలకు సేవలు అందడం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలయ్యాయి. అంటే ఎనిమిది నెలల్లోనే కోటి వినతలను గ్రామ, వార్డు సచివాలయాలు పరిశీలించి పరిష్కరించాయి. 15,003 గ్రామ, వార్డు సచివాలయాలు నెలకు 12.50 లక్షల చొప్పన పరిష్కరించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సేవకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమయంలోపు వినతులు పరిష్కరించాలని సిబ్బందికి దిశానిర్ధేశం చేస్తోంది.
ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే విధులలో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ప్రత్యక్షంగా భాగస్వాములవుతున్నారు. వీరిలో వాలంటీర్లదే కీలక పాత్ర కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2.70 లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వ సేవలు, పథకాలను అందిస్తున్నారు. 1.24 లక్షల మంది సచివాలయ సిబ్బంది వాలంటీర్లను సమన్వయం చేసుకుంటూ ప్రజల వినతులను పరిష్కరిస్తున్నారు.
సచివాలయ వ్యవస్థ ప్రారంభానికి ముందు ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేంది. వ్యయప్రయాశలకోర్చి ప్రజలు వెళ్లిన అనేక రకాల కొర్రీలు వేసేవారు. ఫలితంగా పలుమార్లు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతుండడంతో గ్రామీణ ప్రజలు మిన్నుకుండిపోయేవారు. అయితే ప్రస్తుతం తమ గ్రామానికే అధికారులు రావడం, ప్రజల బదులు వాలంటీర్లే వారి వినతులను సచివాలయాల వద్దకు తీసుకెళ్లడంతో ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతోంది. ఈ విధానం వల్లనే కేవలం ఎనిమిది నెలలోనే కోటి వినతలు పరిష్కారం అయ్యాయి. భవిష్యత్‌లో అత్యుత్తమ సేవలకు కేరాఫ్ అడ్రెస్‌లుగా సచివాలయాలు నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.