iDreamPost
android-app
ios-app

Omicron Virus, India – దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఇదీ ప‌రిస్థితి..!

Omicron Virus, India –  దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఇదీ ప‌రిస్థితి..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్త‌మై ప‌లు ఆంక్ష‌లు విధించింది. తాజాగా ఆంక్ష‌ల‌ను వ‌చ్చే ఏడాది జ‌వ‌న‌రి 31 వ‌ర‌కు పొడిగించింది. పెరుగుతున్న కేసుల‌కు అనుగుణంగా చ‌ర్య‌ల‌పై దృష్టి సారిస్తోంది. తాజా కేసుల పట్టికను ప‌రిశీలిస్తే.. ఆదివారం వరకు రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ, సోమవారం ఉదయం సమయానికి మొదటి స్థానానికి చేరింది. ఒక రోజు ముందు అక్కడ 79 కేసులే ఉండగా, ఇప్పుడవి 142కు పెరిగాయి. వీరిలో 23 మంది కోలుకున్నారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచి అక్కడ రాత్రి కర్ఫ్యూ మొదలైంది.

కొవిడ్‌ ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రజలు పకడ్బందీగా పాటించడం లేదు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి నుంచి ఢిల్లీలో గరిష్ఠంగా రూ.1.50 కోట్ల జరిమానా వసూలు చేశారు. ఇక ఢిల్లీలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు కూడా సోమవారం ఆరు నెలల గరిష్ఠానికి పెరిగాయి. దీంతో మరోసారి ఢిల్లీ పరిధిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే.. మాల్స్‌, రెస్టారెంట్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, స్పాలు, రవాణా సర్వీసులు, మెట్రో రైళ్లు, జిమ్‌ల కార్యకలాపాలపై మరోసారి ఆంక్షలు అమల్లోకి వస్తాయి.

దేశంలో సోమవారం మరో నూట యాభై ఆరు మందికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 578కి పెరిగింది. వీరిలో 151 మంది ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌ కేసుల్లో ఢిల్లీ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ ఇప్పటివరకు 141 మందికి ఒమిక్రాన్‌ సోకగా, 42 మంది కోలుకున్నారు. కేరళలో 57 ఒమిక్రాన్‌ కేసులు ఉండగా ఒక్కరు రికవర్‌ అయ్యారు. . 49 కేసులతో గుజరాత్‌ నాలుగో స్థానలో ఉండగా ప‌ది మంది కోలుకున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు న‌ల‌భై మూడు మందికి ఒమిక్రాన్‌ సోకగా, ముప్పై మంది రికవర్‌ అయ్యారు.

ఆరో స్థానంలో ఉన్న తెలంగాణలో మొత్తం న‌ల‌భై ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా, ప‌ది మంది కోలుకున్నారు. తాజాగా సోమ‌వారం కూడా ప‌న్నెండు కేసులు న‌మోద‌య్యాయి. పదోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కేసులు నమోదవగా, ఒకరు రికవర్‌ అయ్యారు. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,531 మందికి కొవిడ్‌ సోకగా, 315 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌కు వినియోగించిన మొత్తం టీకా డోసుల సంఖ్య 141.70 కోట్లకు చేరింది. మహారాష్ట్రలోని పుణెలో ఓ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ప‌ద‌మూడు మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. దీంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.