iDreamPost
android-app
ios-app

ఒమన్ సుల్తాన్ – ఈ శతాబ్దపు కర్మ యోగి !

ఒమన్ సుల్తాన్ – ఈ శతాబ్దపు కర్మ యోగి !

ఆధునిక అరబ్ ప్రపంచంలోనే ఒక దేశాన్ని అత్యధిక కాలం పాటు నిరాటంకంగా పరిపాలించిన గొప్ప మనావతా మూర్తి, ఉదారవాది, ఆధునిక అరబ్ ప్రపంచ నిర్మాత అయిన ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ ఇక లేరు. అరబ్ దేశాల్లో సౌదీఅరేబియా తరువాత అతి పెద్ద దేశం ఒమన్ ని 5 దశాబ్దాల పాటు అత్యంత ప్రజారంజికంగా పారిపాలించిన ఆయన కొంత కాలంగా పెద్ద పేగు కేన్సర్ తో బాద పడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచినట్టు అధికారికంగా ప్రకటించారు. ఖాబూస్ కి పిల్లలు సోదరులు లేకపోవడంతో ఆయనకి వరుస సొదరుడైన ఆ దేశపు సాంస్కృతిక శాఖ మంత్రి 65 ఏళ్ల హైతమ్ తారీక్ ని కొత్త సుల్తాన్ గా భాద్యతలు చేపట్టినట్టు ఆ దేశపు అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది

ఒమన్ దేశపు సుల్తాన్ అయిన తన తండ్రి ఖబూస్ ని యవ్వనాన్ని ఎంజాయ్ చేస్తూ జల్సాగా తిరగమంటే ఆయన మాత్రం తాను మాత్రం చదువుకోవాలి అన్నాడు. భారత్, ఇంగ్లాండ్ తో పాటు ప్రపంచం అంతా తిరిగాడు. బ్రిటీష్ రాయల్ మిలటరీ లో కూడా కొంతకాలం పని చేశాడు

అయితే స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత సుల్తాన్ గా ఉన్న తన తండ్రి నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తోటి అరబ్ దేశాలన్ని ఆయిల్ వెలికితీత తో అభివృద్దిలో కొత్త పుంతలు తొక్కుతుంటె.. తన తండ్రి చాదస్తం, నియంతృత్వ పోకడలు వల్ల ఒమన్ బాహ్య ప్రపంచం తో సంబంధాలు లేకుండా ఒంటరిగా మిగిలిపొవడం, అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడి పోవడం, దేశంలో రోడ్లు, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం చూసిన ఈయన తన 29 ఏళ్ళ వయసులోనే నియంత అయిన తన తండ్రి మీదే తిరుగుబాటు చేసి ఆయన నుండి అధికారం హస్తగతం చేసుకున్నాడు.

1970 లో అధికారంలోకి వచ్చాక తన ఉదార వాద, ప్రజాస్వామ్య విధానాలతో ఎడారి దేశం ఒమన్ ని అభివృద్దిలో పరుగులు పెట్టించాడు. ఆయన దేశానికి సుల్తాన్ గా మాత్రమే కాక ప్రధాని,విదేశాంగ,ఆర్ధిక రక్షణ శాఖలను పర్యవేక్షించడం తో పాటు సుధీర్ఘ కాలం సైన్యానికి చీఫ్ కమాండర్ గా సేవలందించారు.

ఒమన్ ని ఆధునిక సంపన్న దేశంగా మార్చిన ఘనత ఖబూస్ కే దక్కుతుంది. 2010 లో ఐక్యరాజ్యసమితి గడిచిన 40 సంవత్సరాల కాలం లో అత్యంత అభివ్రుద్ది చెందిన దేశాల లిస్ట్ ప్రకటించినప్పుడు ఒమన్ దేశానికి అగ్రస్థానం ఇచ్చింది. దీనికి కారణం ఒకే ఒక్కడు అతనే ఒమన్ సుల్తాన్ “ఖబూస్ బిన్ సయిద్”

ఖబూస్ బిన్ సయిద్ ఒమన్ దేశాన్ని ఆధునీకరించిన ఒక దార్శినికుడు మాత్రమే కాదు, ఒక కర్మ యోగి 1976 లో పెండ్లి చేసుకొని మూడు యేండ్ల తర్వాత కుటుంభ కలహాల కారణం గా విడాకులు తీసుకొన్నాడు. దేశాన్ని అభివ్రుద్ది చేయాలని కంకణం కట్టుకొని జీవితంలో మళ్ళీ పెండ్లి చేసుకోలేదు. ముస్లిం సుల్తాన్ అయినా పెండ్లి చేసుకోకుండా, పిల్లలని కనకుండా దేశం అంతా తన కుటుంభం అనుకున్నాడు.

ఒమన్ ముస్లిం దేశం అయినా ఖబూస్ దేశవ్యాప్తంగా కొన్ని చర్చ్ లు, దేవాలయాలు కట్టించాడు. విశ్వవిద్యాలయాలు కట్టించాడు. దేశం లో ఉండే ప్రజలకి మత స్వేఛ్చ ఇచ్చాడు. ఒమన్ లో 90% అక్షరాస్యత. 4% మాత్రమే సాగుభూమి, మిగతా అంతా ఎడారి అయినా ఆ 4% లో ప్రతి ఇంచు ని ఉపయోగించుకోగలిగితే చాలు అనేవాడు. ఎడారిలో తాగటానికే నీళ్ళు ఉండవు కానీ ఒమన్ లోని పురాతన అఫ్లజ్ ఇర్రిగేషన్ సిస్టం ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించింది.

ఒమన్ లొ సామాన్యులు ఎటువంటి ట్యాక్స్ లు కట్టే పని లేదు, సోషల్ సెక్యూరిటీ కోసం కొంత మొత్తం కడితే చాలు.

ఖబూస్ కి భారత దేశంతో ప్రత్యేక అనుభందం ఉంది.ఆయన పుణే లో కొంత కాలం చదువుకున్నారు. పూర్వంలొ అయన అనేక భారతీయ ప్రైవేట్ కంపెనీలను తమ దేశానికి ఆహ్వానించి వ్యాపారవకాశాలు కల్పించారు. ఆంతే కాకుండా భారతీయ వృత్తి నిపుణులను, కార్మికులను తమ దేశానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఆయన 50 ఏళ్ల పరిపాలన లో భారతీయ కార్మికులకు ఒమన్ లొ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. ఇటీవల కాలంలో అయన అనారొగ్యానికి గురయ్యాక పరిపాలన వ్యవహారాలని ఇతరులు పర్యవేక్షించడంతో భారతీయ వ్యాపారులకు కార్మికులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. భారతీయ ఉద్యోగులకు నూతన వీసా ల జారీ ప్రక్రియ ని కుడా నిలుపుదల చేశారు.

ఖాబూస్ యొక్క వ్యక్తిత్వం గొప్పతనం, నిరాడంబరత ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఈ ఒక ఉదాహరణ చాలు. 1994 లొ అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు మస్కట్ పర్యటనకి వెళ్లినప్పుడు తమ సుల్తాన్ ఖాబూస్ భారత రాష్ట్రపతి కి స్వాగతం పలికిన తీరు చూసి యావత్ ఒమన్ దేశం ఆశ్చర్యపోయింది. సాధారణంగా అతిధులకి స్వాగతం పలకడానికి ఎప్పుడూ విమానాశ్రయానికి రాని ఖబూస్ ఆ రోజు విమానాశ్రయానికి రావడమే కాకుండా విమానంలో రాష్ట్రపతి కుర్చున్న సీటు దగ్గరకి వెళ్లి స్వాగతం పలకడమే కాకుండా ప్రొటొకాల్ ని పక్కన పెట్టి స్వయంగా తానే రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి కారుని నడిపారు.

దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఖబూస్ సమాధానం చెబుతూ నేను ఇండియాలో చదువుకున్నప్పుడు ఎంతో నేర్చుకున్నాను. నేను పుణే లో చదువుకునేటప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు స్వయానా నా గురువు. నేను అయన దగ్గర ఎంతో నేర్చుకున్నాను. నేను ఈ దేశ సుల్తాన్ గా కాకుండా ఆయన శిష్యుడి గా రాష్ట్రపతి ని ఆహ్వానించడానికి వెళ్లాను ఆని సమాధానమిచ్చాడు. ఆవిధంగా ఒక దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ హోదా ని పక్కన పెట్టి తన గురు భక్తిని చాటుకున్నాడు.

ఆయనకి తెలుగు వారితో కుడా ప్రత్యేక అనుభందం వుంది. ఆయన పాలన లో ఎంతోమంది ప్రవాసాంధ్రులకు ఒమన్ లో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఒమన్ లో అతి పెద్ద టౌన్ షిప్ ని నిర్మించడానికి ముంబాయికి చెందిన ఒక ప్రముఖ భవన నిర్మాణ కంపెనీని తన దేశానికి ఆహ్వానించినప్పుడు ఆ కంపెనీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్న ప్రస్తుతం తెలంగాణ కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు జితేందర్ రెడ్డి పని తీరు చూసి ఎంతగానో ముగ్ధుడయ్యాడు. అప్పటి నుండి జితేందర్ రెడ్డి ని ఖబూస్ బాగా అభిమానించేవాడు జితేందర్ రెడ్డిని ఆ దేశం తరుపున అదికారికంగా కుడా సత్కరించాడు.

తన చివరి రోజుల్లో కొన్ని రోజులు యూరప్ లో చికిత్స కోసం వెళ్ళి ట్రీట్ మెంట్ చేస్తే ఇంకా బతకొచ్చు అని చెప్పినా నా దేశ కార్మికులు చిందించిన చెమట, రక్తం తో ఇంకా నేను బతాకల్సిన అవసరం లేదు అని స్వదేశానికి వచ్చి చనిపోయిన ఖబూస్ బిన్ సయిద్ స్పూర్తి నిజంగా యావత్ ప్రపంచానికే గర్వకారణం. ఈరోజు ఒమన్ లో పనిచేయటానికి వెళ్ళిన ప్రతి కార్మికుడూ మా దేవుడు లేడు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారంటే అయన ఎంత గొప్పవాడో అర్దం చేసుకోవచ్చు.

నిజంగా ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ జీవితం మన రాజకీయ నాయకులు చదవాల్సిన పుస్తకం. అందుకే ఆయన ఒక పాలకుడు మాత్రమే కాదు. తాను నమ్మిన సిద్దాంతాలను ఆశయాలను తన తుది శ్వాస వరకు ఆచరించిన ఒక కర్మ యోగి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి