Idream media
Idream media
సముద్రం అందరిదీ కానీ, అన్ని సముద్రాలు ఒక్కలా ఉండవు. మెరీనా బీచ్‌లో ఒకలా కనిపిస్తుంది. రుషికొండలో ఇంకోలా, గోవాలో కొంచెం ఖరీదుగా కనిపిస్తుంది. మనుషుల కోలాహలం ఉంటేనే సముద్రానికి విలువ. లేదంటే అది పిచ్చెక్కినదానిలా ఒంటరిగా వుంటుంది.
మెరీనాలో సముద్రం చైతన్యంగా కనిపిస్తుంది. చిన్నచిన్న వస్తువులు అమ్ముకునేవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. మురుకులు, వేరుశనక్కాయలు, చేపలతో బజ్జీలు ఇంకా చాలాచాలా కనిపిస్తాయి. సాధారణమైన జనం ఎక్కువగా ఉంటారు. సముద్రం ఇక్కడ బతుకుతెరువు.
రుషికొండలో మధ్యతరగతి కనిపిస్తుంది. మరీ అంత ఖరీదుగా ఉండదు, పేదగా ఉండదు. అమ్ముకునే వాళ్లు ఉంటారు కానీ, బీచ్‌లోకి రారు.
గోవా బీచ్ ఖరీదుగా కనిపిస్తుంది. హైఫై ప్రజలు ఎక్కువ. విదేశీయులు, హనీమూన్ జంటలు సేదతీరుతూ కనిపిస్తాయి. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు తక్కువగా కనిపిస్తారు.
తరగతులు, భాషల్లో తేడా ఉన్నా అంతరంగంలో మనుషులంతా ఒకటే. పెద్దవాళ్లు కొంచెం తేడాగా ప్రవర్తించినా , పిల్లలంతా ఒకేలా ఉంటారు. వాళ్లకి ఇగో ఇంకా ఏర్పడి ఉండదు.
మెరీనా , రుషికొండలో మందు నిషేధం. గోవా అంటేనే మందు. బీచ్‌లో కుప్పతెప్పలుగా బార్ అండ్ రెస్టారెంట్లు.
సముద్రం అంటే ప్రతి ఒక్కరికీ వినోదం, భయం కూడా. దూరంగా పెద్దపెద్ద ఓడలు కనిపిస్తాయి. ఒక ఓడని తయారు చేయాలంటే కొన్ని వందల మంది పనివాళ్లు కావాలి. రక్తం , చెమటతో తడుస్తూ తయారవుతాయి.
మనిషికైనా , వస్తువులకైనా ఒక జీవితం, మరణం ఉంటాయి. కొన్ని వందల పచ్చటి చెట్లు తెగి కిందపడితే ఎండిన కొయ్యలవుతాయి. వడ్రంగుల రంపాలు కరకరమనే శబ్దంతో వాటిని మలుస్తాయి. ఒక ఓడ జలప్రవేశం చేస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహం, కోలాహలం.
అది కొన్నివేల మందిని మోస్తూ సముద్రంలో తిరుగుతుంది. ఎన్నో కలలు, ఆశలు, ప్రేమలు, కలహాలు దానిమీద ప్రయాణిస్తాయి. అడుగున సొర చేపలు, తిమింగలాలు పలకరిస్తూ ఉంటాయి.
మనుషులలాగే ఓడ కూడా ముసల్ది అయిపోతుంది. ఆఖరి ప్రయాణం ముగుస్తుంది. ఒడ్డున తెచ్చి పడేస్తారు. దానిలో భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. పనికొచ్చే వాటిని ఇతర ఓడల నిర్మాణంలో వాడుతారు. ఒక రకంగా అవయవదానం. ఎంత చేసినా సముద్రానికి ముసలితనం రాదు. అది నిత్య యవ్వని.