iDreamPost
android-app
ios-app

నువ్వే కావాలి – ఓ అందమైన జావళి – Nostalgia

  • Published May 07, 2020 | 7:43 AM Updated Updated May 07, 2020 | 7:43 AM
నువ్వే కావాలి – ఓ అందమైన జావళి – Nostalgia

2000 సంవత్సరం అక్టోబర్ నెల

“ఎవరెవరి దగ్గర ఎంత ఉందో మొత్తం బయటికి తీయండ్రా. అవతల షోకి రెండు గంటలే టైం ఉంది. ముందే వెళ్లకపోతే టికెట్లు కాదు కదా బయట బండి మీద పుచ్చకాయ పీసులు కూడా దొరకవు. కమాన్ కమాన్”

మా గ్యాంగ్ లీడర్ బంటీ గాడి హడావిడి మాములుగా లేదు. బ్యాచ్ దగ్గర డబ్బులు మొత్తం వసూలు చేసి థియేటర్లో వాడికి తెలిసిన ఎవరో స్టాఫ్ దగ్గర సినిమా టికెట్లు బల్క్ లో తెచ్చేసి కాసేపు బిల్డప్ కొట్టాక అందరికి పంచుతాడు. ఇదంతా ఏ చిరంజీవి బొమ్మకో అనుకునేరు. మీసాలు నిజంగా వచ్చాయా లేక నల్లని స్కెచ్ పెన్నుతో దిట్టంగా మూతి మీద గీశారా అని అనుమానం వచ్చే వయసున్న తరుణ్, రెండు నెలలు సరిగా భోజనం చేయకుండా చిక్కిపోతే ఎలా ఉంటుందో మోడల్ గా చూపించేందుకు తయారయ్యిందా అనిపించేలా ఉన్న రిచా హీరో హీరోయిన్లు.

టైటిల్ “నువ్వే కావాలి”

ఆదోని ద్వారకాశ్రీ థియేటర్. మరీ పెద్దది కాదు అలా అని చిన్నది కాదు. ఓ మోస్తరు కెపాసిటీ. మా కాలేజీలో ఏదైనా ఒక సబ్జెక్టు బ్రాంచీ మొత్తం వస్తే హౌస్ ఫుల్ బోర్డు పడేంత సీట్లే ఉండటం వల్ల ఈ తిప్పలు. పోనీ డబుల్ హాల్స్ లో వేశారా అంటే అదీ లేదు. సింగల్ స్క్రీన్. తిట్టుకున్నా కొట్టుకున్నా అందులోనే చూడాలి. వేరే ఆప్షన్ లేదు. అసలే డిగ్రీ చదువుతున్న రోజులు. ప్రేమకథలతో ఏ సినిమా వచ్చినా మన అటెండెన్స్ లేకపోతే అది విద్యార్ధి జాతికే అవమానం అనే రేంజ్ లో నాన్న జేబులకు చిల్లులు పెట్టే ఉధృతమైన ట్రెండ్. రిలీజ్ కు ముందే పాటలు హోరెత్తిపోతున్నా అసలు మ్యాటర్ ఎలా ఉంటుందోనన్న అనుమానాల మధ్య మొదటి వారమే ఇలాంటి సినిమా చూడకపోతే ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో తర్వాత ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది

కౌంటర్ దగ్గర చిన్నా పెద్దా యూత్ ఏజ్డ్ అనే తేడా లేకుండా ఎగబడిపోతున్నారు. ఈ తాకిడికి అది ఎక్కడ విరుగుతుందో అన్న భయం చాలాసార్లు వేసేది. టాకీస్ ఓనర్ తెలివైన వాడు కాబోలు. ధృడమైన నాగార్జున సిమెంట్ తో కట్టాడు. మల్టీ ప్లెక్స్ గా మారేంత వరకు చెక్కుచెదరలేదు. ఏదైతేనేం మొత్తానికి మా బంటి గాడు వీర గర్వంతో టికెట్లు తెచ్చి మా అందరిని లోపలికి లాక్కెళ్ళాడు. అప్పటికే ఈటీవీలో చూసి చూసి మైండులోకి బాగా ఎక్కేసిన ఈ ఉషాకిరణాలు ప్రగతి రధచక్రాలు అనే బ్యానర్ సాంగ్ తో సినిమా స్టార్ట్ అయ్యింది

కాసేపు నవ్వుతున్నాం. కాసేపు మైమరిచిపోతున్నాం. కాసేపు గొంతులు పోయేలా పాటలకు హుషారుగా ఈలలు వేస్తూ గోల చేస్తున్నాం. కాసేపు దిగులు పడుతున్నాం. కాసేపు అసహనంతో ఊగిపోతున్నాం. కాసేపు తన్మయత్వంతో ఓలలాడుతున్నాం . చివరికి కన్నీళ్ళు తుడుచుకుంటూ మధు లాంటి అమ్మాయి దొరికితేనే జీవితంలో పెళ్లి చేసుకోవాలనే శపథంతో బయటికి వస్తూ మళ్ళి ఇంకోసారి నువ్వే కావాలి ఎప్పుడు చూడాలా అనే ప్లాన్ తో ఇంటికి చేరుకునే వాళ్ళం.

స్టార్లు లేకుండా ఓ చిన్న సినిమా ఇంత మేజిక్ చేయగలదా ?

ఇమేజ్ లేని తారలు నటిస్తే ఎక్కడో కర్ణాటక బోర్డర్ లో ఉండే చిన్న పట్టణంలో ఓ మూవీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుందా?

ఆడియో క్యాసెట్ల కోసం రెండు మూడు రోజులు షాపు చుట్టూ ప్రదక్షిణాలు చేసే పరిస్థితి వస్తుందా ?

రెండు మూడో సారి కంటే మొదటి సారి చూడటమే సులభమనే స్థాయిలో ఓ సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఈ స్థాయిలో ప్రభావం చూపిస్తుందా?

నిజ జీవితంలో ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలియని ఇద్దరు స్నేహితులను ప్రేమికులుగా మార్చే శక్తి సినిమాకు ఉంటుందా ?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఔననే చెప్పించింది నువ్వే కావాలి…

హీరో హీరొయిన్లు ఒకరినొకరు అతిగా తాకకుండా, వర్షంలో తడుస్తూ పాటలు పాడుకోకుండా, హద్దులు దాటి ముద్దులు పెట్టుకునే లాంటి పనులు చేయకుండా ప్రేమించుకోవచ్చనే ఓ గొప్ప సందేశాన్ని వెండితెర సాక్షిగా ఆవిష్కరించింది నువ్వే కావాలి

మాటల మాయాజాలంలో పడేయగల త్రివిక్రముడి కలం శక్తిని……

ఆవేశపు భావోద్వేగాలే కాదు యువత సున్నిత హృదయాల్లోని ప్రేమ తాలుకు మధురిమల్ని తన సాహిత్యంతో కురిపించిన సిరివెన్నెలని…..

కోటిలోని మనకు పరిచయం లేని ఓ సరికొత్త యూత్ ఫుల్ సంగీత దర్శకుడిని…..

విజయ భాస్కర్ అనే దర్శకత్వ ప్రతిభా నైపుణ్యాన్ని…..

ఎన్నెన్నో పరిచయం చేసింది ఈ నువ్వే కావాలే…..

అందుకే డిగ్రీ చదువు మిగిల్చిన జ్ఞాపకాల్లో నువ్వే కావాలిది ఎప్పటికి చెదిరిపోని స్థానం. అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్ పోస్ట్

కొసరు మాట :

ఇటీవలే ఓ ఛానల్ లో నువ్వే కావాలి చూస్తున్నప్పుడు అలా జ్ఞాపకాలు వెనక్కు వెళ్లి కాల ప్రయాణం చేయించాయి. అందుకే టైం మెషిన్ లో 2000వ సంవత్సరానికి వెళ్ళిపోయి కాసేపు మల్టీ ప్లెక్సు కల్చర్ లేని ఓ సినిమా హాల్ లో ఇలా సేదతీరి రావాల్సి వచ్చింది.