Idream media
Idream media
అమెరికా సహకారంతో కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు రాజ్యసభలో పీఎంవో కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు గానూ ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్థ్యం లో ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.
దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ (పీహెచ్‌డబ్ల్యూఆర్)ను ప్రతిపాదిత కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయడంలేదని ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా… అదనంగా మరో 10 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు జరిగినట్టుగా మంత్రి పేర్కొన్నారు. రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.
ఇక న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అమలు చేస్తున్నట్టుగా మరో కేంద్ర మంత్రి ప్రకటించారు. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు… విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయలను కల్పించి, అభివృద్ధి చేసే ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వలదే అని ఆయన స్పష్టం చేశారు. అయినా సరే ఈ ప్రక్రియలో తమ వంతు సహకారం ఉంటుందని, ఆర్థిక సహకారం అందిస్తామని అన్నారు.
ఈ పథకంలో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రమే భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. హిమాలయ రాష్ట్రాలు అయిన ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలైతే వ్యయంలో కేవలం 10 శాతం భరిస్తే చాలు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 2021 నుంచి మరో అయిదేళ్ళపాటు పొడిగించిందని, ఈ పథకం కింద 9 వేల కోట్ల రూపాయలు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5307 కోట్లని స్పష్టం చేశారు.
Also Read : నాగోబా జాతర.. అత్యంత ప్రాచీనం.. విశిష్టం..!