ఛార్జీల్లేవ్‌..! అవి పుకార్లే..!

ఏందీ మామా.. మాట్లాడితే గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీయం అంటున్నావు.. జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌ పేమెంట్లపై ఛార్జీలు వేస్తారంట తెలుసా.. ఇటీవలి కాలంలో ఎక్కడికెళ్ళినా తరచు విన్పిస్తున్న మాట. అయితే ఇందులో నిజం లేదని తేలిపోయింది. జరుగుతున్నవన్నీ పుకార్లేనని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది.

సాధారణంగా ఆన్‌లైన్‌ పేమెంట్లు మన దేశంలో తొలుత అంత స్పీడందుకోలేదనే చెప్పాలి. వాటి పట్ల అవగాహన లేకపోవడం, ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉండడం తదితర కారణాలతో ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రజలు కాస్తంత దృష్టి పెట్టలేదనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే కరోనా ఎంటరైందో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు గణనీయంగా పెరిగిపోయాయి. ఇవి ఎంతగా పెరిగాయంటే.. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌ (యూపీఐ) అంచనా ప్రకారం 105శాతం మించి పెరిగిపోయాయి. 2020 డిసెంబరు నాటికి యూపీఐ లావాదేవీల విలువ నాలుగు లక్షల కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ అంకెలను బట్టే యూపీఐ చెల్లింపులపై ప్రజలు ఎంతగా ఆధార పడుతున్నారన్నది అంచనా వేయొచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వారిలో దాదాపు 90 శాతం మంది ఫోన్‌ పే, గూగుల్‌పే, యోనో వంటి మొబైల్‌ యాప్‌లు వాడుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ లావేదేవీలపై సర్వీస్‌ ఛార్జీలు పడనున్నాయన్న పుకార్లు గట్టిగానే షికార్లు చేసాయి. ఇవి చివరికి సంబంధిత ఎన్‌పీసీఐ కలగజేసుకుని ఇవన్నీ పుకార్లుగానే కొట్టిపడేసింది. యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని, నిరభ్యంతరంగా ఆ సేవలను ఉచితంగానే వినియోగించుకోవచ్చని తేల్చిచెప్పింది. దీంతో మొబైల్‌లోనే లావాదేవీలు నడిపిస్తున్నవారు ఊపిరిపీల్చుకున్నారు

అంతే కాకుండా జనవిరి 1 నుంచి ఫాస్టాగ్‌ లేని వాహనాలను రహదారులపైగల టోల్‌గేట్‌ల నుంచి అనుమతించరన్నదానికి కూడా తెరపడింది. ఇది వాస్తవమే అయినప్పటికీ మరో 15 రోజులు ఈ గడువును పొడిగించినట్లు ఇటేవల నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

Show comments