iDreamPost
iDreamPost
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియకముందే తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నగారా మోగించింది. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకుఈనెల 16వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు అందజేసేందుకు ఈనెల 18 ఆఖరు కాగా, ఉపసంహరణకు 22వ తేదీ ఆఖరు. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఫలితాలు రిలీజ్ చేయనున్నారు.
గత ఎన్నికల్లో ఇలా..
2016 మార్చి 6వ తేదీన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 50 డివిజన్లు ఉన్న ఖమ్మంలో టీఆర్‌ఎస్ 34 డివిజన్లు గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంది. తర్వాత ఏడుగురు కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడడంతో ఆ పార్టీ బలం 41కి చేరుకుంది. కాంగ్రెస్‌కు ముగ్గురు, వామపక్ష పార్టీలకు ఐదుగురు, టీడీపీ తరఫున ఒకరు కార్పొరేషన్‌లో ప్రాతినిథ్యం వహించారు.
వరంగల్ లోనూ గులాబీదళం ఘన విజయం సాధించింది. 58 డివిజన్లు ఉన్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 49 డివిజన్లలో గెలిచింది. కాంగ్రెస్ నాలుగు, బీజేపీ ఒకటి, సీపీఎం ఒకటి, స్వతంత్రులు మరో మూడు డివిజన్లలో గెలుపొందారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్ ఒకరు, సీపీఎం కార్పొరేటర్, స్వతంత్రులు ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 54కు చేరింది.
Also Read : నాగార్జునసాగర్ : లాస్ట్ పంచ్ కేసీఆర్‌దే అయితే..
డివిజన్లు పెరిగినయ్..
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో డివిజన్లు పెరిగాయి. వరంగల్ లో 66, ఖమ్మంలో 60 డివిజన్లకు చేరాయి. ఇక సిద్దిపేటలో 43, అచ్చంపేటలో 20, కొత్తూరులో 12, నకిరేకల్ లో 20, జడ్చర్లలో 27 వార్డులు ఉన్నాయి.
ముందే మొదలైన టీఆర్ఎస్ ప్రచారం
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రకటన రాకముందు నుంచే అక్కడ ప్రచారం మొదలైంది. వరంగల్ లో కొన్ని రోజులుగా మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. సభల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల హామీలు కురిపిస్తున్నారు. ఇటు ఖమ్మంలో ఎర్ర ‘గులాబీ’లు పూసే పరిస్థితి కనిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పోటీ చేయనుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల ప్రకటన రావడంతో పొత్తుల చర్చలు మొదలుకానున్నాయి.
వరుస ఎన్నికలు
తెలంగాణలో గత ఆరు నెలలుగా వరుసగా ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. గతేడాది దుబ్బాక బై ఎలక్షన్ తో మొదలయ్యాయి. తర్వాత జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ కు ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మిని మున్సిపోల్స్ జరుగనున్నాయి.
Also Read : జానా సొంత ఊర్లో గొడవ.. ఎవరికీ లాభం..?