మూడు నెలల విరామం తరువాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పున: ప్రారంభం కానున్నాయి. వీఆర్వో వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూమల రిజిస్ట్రేషన్ ను సెప్టెంబర్ లో నిలిపివేసింది తెలంగాణ ప్రభుత్వం. ధరణి పోర్టల్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి నవంబర్ మొదటి వారంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ను ప్రారంభించనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్న జనాలు భారీగా స్లాట్ బుక్ చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ల శాఖ పాతవెబ్ పోర్టల్ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవడం తప్పని సరి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రోజుకు 24 స్లాట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్లాట్ బుకింగ్ కోసం 200 రూపాయల ఫీజు మాత్రమే వసూలు చేయనున్నారు. వసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆస్తి పన్ను వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పున: ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లనూ ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే దాదాపు మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్లు జరగాలని సూచించారు. అందుకోసం విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్నచిన్న సమస్యలున్నా, వాటిని అధిగమించి ప్రజలు సంతృప్తినొందేలా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలియజేశారు.
రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసే దిశలో ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు రియల్టర్లు, బిల్డర్లు, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోని అనుకూలమైన విధానాన్ని తీసుకురావాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేసి మంత్రి వర్గ సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధానంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా నిర్మాణాలు గృహనిర్మాణాలు జరుపుకునే పేదల ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూడాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి సుదీర్ఘ సమయం తరువాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభం కావడంతో తెలంగాణలో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.