iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మండలాలు ఉన్నాయి?గూగుల్ లో వెతికితే తెలుస్తుంది.
జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా ఎన్ని కుటుంబాలను కలిశాడు?కొంచం కష్టం అయినా జగన్ వీరాభిమానుల్లో ఎవరో ఒకరి వద్ద వివరాలు దొరకొచ్చు. ఆంధ్రప్రదేశ్లో వైస్సార్ విగ్రహం లేని మండలాలు ఎన్నిఉన్నాయి?ఏంటి వైస్సార్ విగ్రహం లేని మండలాలు ఉన్నాయా?ప్రశ్న రాంగ్… కాదు మొన్నటి వరకు ఒక మండలంలో వైస్సార్ విగ్రహం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు…
ఓదార్పు యాత్ర జరుగుతున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం,అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు,శ్రేణులు జగన్ కు సహకరించకుండా కట్టడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాయకులు నేరుగా పాల్గొనటమో లేకుంటే వారి కుటుంబ సభ్యులనో ఓదార్పు యాత్రకు పంపారు.
ఓదార్పు యాత్రకు ఇబ్బందులు ఎదురైనా జగన్ వర్గం కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని యాత్రను విజయవంతం చేశారు.ఓదార్పు యాత్రలో అనేక చోట్ల వైస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించాడు. ఆయన అనుచరులు, అభిమానులు కొన్ని వేల విగ్రహాలను ఏర్పాటు చేశారు.
కానీ ఒక్క మండలంలో మాత్రం వైస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యలేకపోయారు… కర్నూల్ జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సి.బెళగల్ మండలంలో జగన్ ఓదార్పు యాత్రకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గం జగన్ ఓదార్పు యాత్రకు అడ్డంకులు సృష్టించారు.ఘర్షణ వాతావరణంలో ఓదార్పు యాత్ర జరిగింది. కోట్ల వర్గానికి భయపడి స్థానికులు వైస్సార్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చెయ్యలేదు. కోడుమూరు మండల కేంద్రంలో కూడా వైస్సార్ విగ్రహం ఇప్పటికి లేదు. ఇదే మండలానికి చెందిన కానాపుర కృష్ణా రెడ్డి వారి స్వగ్రామముతో పాటు మరి కొన్ని గ్రామాలలో విగ్రహాలు ఏర్పాటు చేశారు.
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తమ్ముడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పత్తికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. చక్రపాణి రెడ్డి గట్టిగా తలుచుకుంటే వైస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యటం అసాధ్యం కాదు కానీ ఎందుకో 2014 తరువాత ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు.
మొన్న ఎన్నికల ముందు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరటంతో ఆయనకు కుడి భుజంగా వ్యవహరించే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు వైసీపీ బాధ్యతలు తీసుకొని కానాపురం కృష్ణారెడ్డి లాంటి నాయకుల సహకారంతో పాత వర్గాన్ని కూడగట్టి వైసీపీ అభ్యర్థిని మొన్నటి ఎన్నికల్లో గెలిపించుకున్నారు.
ఎన్నికల ముందు హరిచక్రపాణి రెడ్డి తిరిగి అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గూటికి చేరినా,చిరకాల ప్రత్యర్ధులు డి.విష్ణువర్ధన్ రెడ్డి,గడ్డం ప్రకాష్ రెడ్డి ,KE వర్గం అందరూ టీడీపీలోనే ఉన్నా కోట్ల సూర్యపు ప్రకాష్ రెడ్డి కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఒక లక్షా నలభై తొమ్మిది వేల ఓట్ల తేడాతో వైసీపీ తరుపున పోటీచేసిన సంజీవ్ కుమార్ చేతిలో ఓడిపోయారు.
మరి ఇప్పుడు సి.బెళగల్ ల్లో వైస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని ఎవరికీ ఆలోచన వచ్చిందో కానీ వైసీపీ నాయకత్వం ఉమ్మడిగా కదిలి మొన్న 04-Jan-2020 నాడు విగ్రహ ఆవిష్కరణ చేశారు… విశిష్టత తెలియకుండానే కొన్ని జరిగిపోతుంటాయి … ఇది అంతే వైస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన తరువాతనే సి.బెళగల్ మండలం మొత్తంలో ఇదే మొదటి విగ్రహమని వైసీపీ నాయకులు గుర్తించారు.