iDreamPost
android-app
ios-app

మామూలు సాహసం కాదిది.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు

మామూలు సాహసం కాదిది.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు

వర్షాకాలం మొదలైన నాటి నుండి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షాలకు నగరాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక లోతట్టు ప్రాంతాలు అయితే నివాసాల్లోకి వాన నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎటు కదల్లేని పరిస్థితి నెలకొంది. రోడ్లు సైతం చెరువులు తలపిస్తున్నాయి. కాగా, పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  మారుమూల ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించడంలో అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం వరద నీటితో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు పొంగుతుండటంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి కష్టతరం అవుతుంది. ఇక వర్షాకాలం నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రులకు వెళ్లాలంటే.. అటువంటి వాగులను దాటి తీసుకెళ్లాల్సిన దుస్థితి.  అలాంటి వాగులు దాటి పోవాలంటే భయపడిపోతున్నారు స్థానిక గ్రామ ప్రజలు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కెరమెరి మండలం లక్కాపూర్ గ్రామ ప్రజలు ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో ఓ చిన్నారి కొన్ని రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వర్షాల కారణంగా తమకు దగ్గరలోని వాగు పొంగి పొర్లుతోంది. ఆ వాగుపై వంతెన కూడా లేదు. అయితే పిల్లాడి ఆరోగ్యం రోజురోజుకు దిగజారి పోతుంటే.. చూడలేకపోయిన తండ్రి దుస్సాహాసానికి దిగాడనే చెప్పవచ్చు. చిన్నారిని తన చేతులతో పైకి ఎత్తి పట్టుకుని వాగు దాటించారు. బాహుబలి సినిమాలో మన చిన్నారి ప్రభాస్ ను కాపాడేందుకు రమ్యకృష్ణ తీసుకెళ్లిన మాదిరి.. అతడు ఆ బిడ్డను తన చేతులతో పైకెత్తి వాగు దాటించాడు.  కెరమెరికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కాగా, వాగు పొంగుతున్న ప్రతిసారి తాము ఇలాంటి పరిస్థితులను చవి చూస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. నిత్యావసరలు తెచ్చుకోవాలన్నా, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వాగు దాటాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.