Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయంపై తీవ్ర వివాదం నెలకొంది. చర్చలు, వాదోపవాదాలు…రచ్చలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి నైతికతను ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమం వ్యతిరేకిస్తున్న వారి చిత్తశుద్ధిని, నిజాయతీని బహిరంగ వేదిక సాక్షిగా ఏపీలో చర్చకు పెట్టారు. జగన్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, ప్రశ్నలకు ప్రశ్నలే వేస్తున్నారు. ఒక్కసారి జగన్ ఏం ప్రశ్నించారు? విపక్ష నేతలు ఏమంటున్నారో తెలుసుకొందాం.
‘‘ఇదే చంద్రబాబును నేను అడుగుతున్నాను. మీ కొడుకు చదివింది ఏ మీడియం? మీ మనవడు చదవబోతున్నది ఏ మీడియం? ఇదే మాటలు మాట్లాడుతున్న వెంకయ్య నాయుడును అడుగుతున్నాను. అయ్యా వెంకయ్య గారూ, మీ కొడుకు చదివింది ఏ మీడియం? మీ మనవళ్లు చదువుతున్నది ఏ మీడియం?. సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్‌ను అడుగుతున్నాను! అయ్యా పవన్‌కల్యాణ్ గారూ, మీకు ముగ్గురు భార్యలు! బహుశా నలుగురో ఐదుగురో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిస్తున్నారు?’’ అని జగన్ ప్రశ్నించారు.
లోకేష్‌ను తెలుగు మీడియంలో చదివించినా, ఇప్పుడు వారబ్బాయి దేవాన్ష్‌ను చదివించాలనుకున్నా ఎల్లో మీడియాలో ఇదిగిదిగో చంద్రబాబు వారసులు చదివిన తెలుగు పాఠశాలలని తాటికాయంత పతాక శీర్షికలతో రచ్చ రంబోలా చేసి ఉండేవాళ్లు.
అలాగే వెంకయ్యనాయుడు తెలుగు మాధ్యమంలో చదువుతూ ఉంటే…ఇక చెప్పేదేముంది..ఆయన కట్టుబొట్టు, వేషభాషలు పదహారణాల తెలుగుదనాన్ని ఉట్టిపడేలా ఉంటాయి. అసలు తెలుగు భాషకు కర్త, కర్మ, క్రియ…అన్నీ ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకయ్యనాయుడు పుట్టిన తర్వాతే తెలుగు భాష పుట్టిందని చరిత్రకారులు, భాషా శాస్ర్తవేత్తలు చెబుతున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ప్రత్యేక వార్తా కథనాలు, ఎడిట్ పేజీలో ఆయనపై వరుసగా పలువురు ప్రముఖులతో వ్యాసాలు రాయించేవారు.
పవన్ విషయానికి వస్తే…ఆయనో తెలుగు భగ్నప్రేమికుడు. కళ్లు తెరిస్తే జననం, కళ్లు మూస్తే మరణం అని ఓ సినీ కవి అన్నట్టుగా…పవన్ కళ్లు తెరిచినా, మూసినా తెలుగే. ఆయన ఉచ్ఛ్వాసనిశ్వాసాలు తెలుగంటే అతిశయోక్తి కాదు. తెలుగుపై మమకారంతోనే బాలగంగాధర్‌తిలక్, గుంటూరు శేషేంధ్రశర్మ, శ్రీశ్రీ , శివారెడ్డి లాంటి మహా కవుల కవితలను కంఠస్తం చేశారు. ఆయన ఉపన్యాసాల్లో తెలుగుదనం ఓ ప్రవాహంలా జాలువారుతుందంటూ సన్మాన సభలు పెట్టడం ఒక్కటే తక్కువ.
జగన్ స్ట్రయిట్‌గా ఒకేఒక్క ప్రశ్న వేశారు. అయ్యా మీ పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారని? జవాబు తప్ప మిగిలిన విషయాలన్నిటిని విపక్ష నేతలు మాట్లాడుతూ చర్చను పక్కకు మళ్లిస్తున్నారు. ఈ కారణంగా వారి మాటలకు ప్రజల్లో విలువ లేకుండా పోయింది.
మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నబరచుకుంటే ఎలా? ఇంగ్లిష్ నేర్పాలి. కానీ తెలుగును అగౌరవపరిచే పద్ధతి మానుకోవాలి అని జగన్ ప్రశ్నకు పవన్ జవాబిచ్చారు. ఇంకా తన ట్వీట్‌లో అనవసర విషయాలన్నిటి గురించి ప్రస్తావించారు.
ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగే ముద్దు అని ప్రతిపక్ష నేతగా జగన్ ఉద్యమం చేసినప్పుడు ఆయన అమ్మాయిలు తెలుగు మీడియంలోనే చదివారా అని లోకేష్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అయ్యా మరి మీరైతే ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టాలనుకున్నదైతే నిజమే కదా? జగన్ వద్దంటే మాత్రం మీరు దేన్నైనా తీసేస్తారా? జగన్ వద్దని ఎన్ని ఆగడాలను అరికట్టారో ఒక్కసారి వివరంగా ట్వీట్ చేయండి లోకేష్ గారూ?