iDreamPost
android-app
ios-app

మహా విషాదం.. ఒకేసమయంలో అన్నదమ్ముల కుటుంబాలు ఆత్మహత్యలు.. వీడిన మిస్టరీ

  • Published Jun 21, 2022 | 10:03 AM Updated Updated Jun 21, 2022 | 10:03 AM
మహా విషాదం.. ఒకేసమయంలో అన్నదమ్ముల కుటుంబాలు ఆత్మహత్యలు.. వీడిన మిస్టరీ

మహారాష్ట్రలో పెను విషాదం జరిగింది. సోమవారం సాయంత్రం సాంగ్లి జిల్లాలో అన్నదమ్ములు తమ భార్యలు, పిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 9 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పులభారంతోనే రెండు కుటుంబాలు ఇంతటి దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎంహైసల్ గ్రామానికి అన్నదమ్ములు పొపట్ వాన్మొరె (56) వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. మానిక్ వాన్మొరె వెటర్నరీ డాక్టర్. ఇద్దరూ తమ కుటుంబాలతో ఒకే గ్రామంలో వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. సోమవారం (జూన్ 20) మానిక్ వాన్మొరె ఇంటి తలుపులు ఎంతసేపటికీ తెరచుకోకపోవడంతో.. చుట్టుపక్కలవారు వచ్చి చూడగా.. ఇంట్లో నలుగురు విగతజీవులుగా కనిపించారు.

ఈ విషయం అతని సోదరుడైన పొపట్ కు చెప్పేందుకు వెళ్లగా.. అక్కడ కూడా ఇదే దృశ్యం కనిపించింది. మానిక్ ఇంటిలో మానిక్, అతని భార్య, తల్లి, కూతురు, పొపట్ కొడుకు విగత జీవులుగా కనిపించగా.. పొపట్ ఇంటిలో పొపట్, ఆయన భార్య, కూతురు విగతజీవులయ్యారు. వీరంతా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. మానిక్ – పొపట్ ల పిల్లలంతా మేజర్లే. వారి చదువులు, ఆర్భాటాల కోసం తాహతకు మించి చేసిన అప్పులు తీర్చలేకే వారంతా బలవన్మరణాలకు పాల్పడినట్లు ఇద్దరి ఇళ్లలో లభ్యమైన సూసైడ్ నోట్ల ద్వారా తెలిసింది.