MCA బాలీవుడ్ రీమేక్ ఎలా ఉంది?

2017లో వచ్చిన నాని ఎంసిఎ మిడిల్ క్లాస్ అబ్బాయి గుర్తుందిగా. వకీల్ సాబ్ కన్నా ముందు దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమా ఇదే. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కమర్షియల్ గా ఇప్పటికీ న్యాచులర్ స్టార్ కెరీర్ లో టాప్ వన్ ప్లేస్ లో ఉంది. ఇటీవలే వచ్చిన అంటే సుందరానికి దాకా ఏదీ దాన్ని క్రాస్ చేయలేకపోయాయి. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి రేటింగ్స్ తెచ్చుకునే ఎంసిఎ ఇప్పుడు హిందీలో రీమేక్ అయ్యింది. నికమ్మ పేరుతో నిన్నే థియేటర్లలో విడుదల చేశారు. పెద్దగా అంచనాలేమీ లేవు కానీ చాలా గ్యాప్ తర్వాత శిల్పా శెట్టి కంబ్యాక్, మాస్ అంశాలు ఉన్నట్టు అనిపించిన ట్రైలర్ అంతో ఇంతో అంచనాలు రేపాయి.

కానీ ఈ నికమ్మ దారుణంగా బోల్తా కొట్టేసింది. లేలేత వయసులో ఉన్న అభిమన్యు దాసాని హీరో పాత్రకు అంత ఫిట్ గా అనిపించలేదు. తెలుగులో వదిన క్యారెక్టర్ కు భూమిక ఎంత హోమ్లీగా సెట్ అయ్యిందో చూశాం. కానీ శిల్పా శెట్టి బాగానే నటించినప్పటికీ ఆ హుందాతనం రాలేదు. విలన్ గా అభిమన్యు సింగ్ మరీ రొట్ట రొటీన్ గా అనిపించాడు. హీరోయిన్ షిర్లే ఏ కోణంలోనూ సాయిపల్లవికి మ్యాచ్ కాలేకపోయింది. తెలుగులోనూ రొటీన్ లైన్ అనిపించుకున్నప్పటికీ ఎంసిఏని యూత్ తో పాటు మాస్ ఆదరించారు. దానికి ప్రధాన కారణం క్యాస్టింగ్ లోకి క్వాలిటీ. దీని దరిదాపుల్లోకి కూడా ఈ నికమ్మ వెళ్ళలేదు. ఇదంతా ముమ్మాటికీ దర్శకుడు సబ్బిర్ ఖాన్ సెల్ఫ్ గోల్.

అసలే ఒక్క హిట్టు ఆరు ఫ్లాపులతో భోరుమంటున్న బాలీవుడ్ కు ఇప్పుడీ నీకమ్మా ఇంకో దెబ్బ వేసింది. నెగటివ్ రివ్యూలతో పాటు మొదటి రోజు కలెక్షన్ కేవలం 51 లక్షలు వచ్చిందని ట్రేడ్ రిపోర్ట్. ఇవాళ రేపు అంతో ఇంతో రాబట్టిన ఫైనల్ గా డిజాస్టర్ దెబ్బ తప్పేలా లేదు. ఉన్నంతలో భూల్ భులయ్యా 2నే ఇంకా రన్ అవుతోంది. ఇది కూడా రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. సౌత్ హిట్స్ ని గుడ్డిగా రీమేక్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ నికమ్మ నిరూపిస్తోంది. టైటిలే నవ్వొచ్చేలా పెడితే ఎవరు మాత్రం ఎం చేస్తారు. ఆ మధ్య జెర్సీ ఇప్పుడు ఫ్రెష్ గా నికమ్మ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండో రీమేక్ డిజాస్టర్ కొట్టడం కన్ఫర్మ్ అయ్యింది

Show comments