iDreamPost
iDreamPost
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ మరోసారి కన్నెర్ర చేసింది. ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధించింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నివాసానికి సమీపంలో కృష్ణా నదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఫైన్ వేసింది. పర్యావరణానికి తూట్లు పొడుస్తూ అక్రమంగా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు చేసినందుకు ఏకంగా రూ 150కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
ఇప్పుడు మరోసారి చంద్రబాబు వ్యవహారంతో ఏపీకి ఎన్జీటీలో తలవంపులు తప్పలేదు. విజనరీ అని రకరకాలుగా ప్రచారం చేసుకునే చంద్రబాబు ముందుచూపు లేకుండా చేసిన నిర్మాణాల మూలంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇక్కట్లు వచ్చాయి. వాస్తవానికి ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇప్పటికే దాని ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. కానీ దానికి భిన్నంగా ఆడంబరంగా చేపట్టిన పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకాల మూలంగా ఏపీ ప్రభుత్వం పరువు కోల్పోవాల్సి వచ్చింది.
కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన వివిధ ప్రాజెక్ట్ లకు గానూ ఏపీ ప్రభుత్వం జరిమానా చెల్లించాలని ఎన్జీటీ తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్రాజెక్టులపై రూ.120 కోట్లు జరిమానా విధిస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. అందులో గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు కి దిగువన ఎడమ గట్టుపై నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రూ. 24.56 కోట్లు,పట్టిసీమకు రూ. 24.90 కోట్లు చొప్పున చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. వాటితో పాటుగా చింతలపూడి ఎత్తిపోతలకు రూ. 73.6 కోట్ల పైన్ విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించాలని ఎన్టీజీ పేర్కొంది.
నిధులు లేవనే పేరుతో పోలవరం పనులు ఆపేసి మరీ పట్టిసీమ నిర్మించారు. అందులో భారీ స్థాయిలో అక్రమాలు సాగినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చివరకు కాగ్ కూడా దానిని నిర్ధారించింది. సుమారు 1600 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన పట్టిసీమలో రూ. 300 కోట్ల వరకూ అవినీతి జరిగిందని కాగ్ పేర్కొంది. అవినీతికి తోడు అక్రమ నిర్మాణాలని ఎన్జీటీ తేల్చడంతో బాబు బండారం బయటపడింది. అడ్డగోలుగా లిఫ్ట్ స్కీములను చేపట్టి, అవినీతి కార్యక్రమాలకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వ తీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరువుని మంటగలిపేలా మారిందనడానికి తాజా తీర్పు ఓ ఉదాహరణగా కనిపిస్తోంది.
అంతేగాకుండా పట్టిసీమను గుర్తించడానికి కేంద్రం కూడా నిరాకరించడం విశేషం. వాస్తవానికి పోలవరం పూర్తి చేసి ఉంటే పట్టిసీమ వంటి వాటి అవసరమే లేదు. అంతేగాకుండా పోలవరం పూర్తయిన వెంటనే పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి వాటిని మూసుకోవడం మినహా మరో మార్గం కూడా లేదు. అయినప్పటికీ అడ్డగోలుగా చంద్రబాబు అక్రమార్జన కోసం చేసిన ప్రయత్నాలు ఎలా ఉంటాయో మరోసారి తేటతెల్లమయ్యింది. అంతకుముందు వైఎస్సార్ హయంలో చేపట్టిన తాటిపూడి, పుష్కర వంటి ఎత్తిపోతల పథకాలు అన్ని అనుమతులతో నిబంధనల మేరకు కట్టారు. దాని ఫలితాలను ప్రజలకు అందించారు. కానీ చంద్రబాబు కాలంలో మాత్రం దానికి భిన్నంగా జరిగిందని ఎన్జీటీ కూడా తీర్పునివ్వడం గమనిస్తే వైఎస్సార్, చంద్రబాబు పాలనా తీరుకి మంచి ఉదాహరణలుగా మిగిలిపోతాయనే చెప్పవచ్చు.