iDreamPost
android-app
ios-app

ఎఫ్3 కథలో కొత్త ట్విస్టు

  • Published Nov 23, 2020 | 10:57 AM Updated Updated Nov 23, 2020 | 10:57 AM
ఎఫ్3 కథలో కొత్త  ట్విస్టు

గత ఏడాది సంక్రాంతికి పెద్దగా అంచనాలు లేకపోయినా భారీ పోటీని తట్టుకుని వంద కోట్ల వసూళ్లతో సూపర్ విన్నర్ గా నిలిచిన ఎఫ్2 సీక్వెల్ కి వచ్చే నెల నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించడంతో ఉన్న కొద్దిపాటి అనుమానాలు తొలగిపోయాయి. అనిల్ త్వరలో నాగార్జున అఖిల్ కాంబోలో ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో తనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అక్కినేని కంపౌండ్ సినిమా భవిష్యత్తులో ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎఫ్3 ఎలా ఉండబోతోందన్న దాని మీద కొన్ని లీకులు వస్తున్నాయి.

ఫస్ట్ పార్ట్ లో మొగుడు పెళ్లాల సరదాలు అల్లరితో గడిచిపోవడంతో ఈసారి పిల్లల్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే వెంకటేష్ కు మాత్రమే సంతానాన్ని పెట్టి వాళ్ళ వల్ల వరుణ్ తేజ్ జంట ఇబ్బందులు పడటాన్ని ఇందులో చూపించవచ్చని అంటున్నారు. ఇదేమి అనిల్ అధికారికంగా చెప్పింది కాదు కానీ నిజమైనా కూడా మంచి ఎంటర్ టైన్మెంట్ కు ఢోకా లేనట్టే. మూడో హీరో కూడా ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ అందులో వాస్తవం ఉండకపోవచ్చు. మహేష్ బాబునే అడిగినట్టు లాక్ డౌన్ కు ముందు ప్రచారం జరిగింది. కానీ అదంతా ఉత్తుత్తిదేనని తర్వాత అర్థమైపోయింది.

ఎలాగూ క్రేజీ సీక్వెల్ కాబట్టి బిజినెస్ పరంగా ఎలాంటి సమస్య ఉండదు. వెంకటేష్ ప్రస్తుతం నారప్ప పూర్తి చేసే పనిలో బిజీగా ఉండగా వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ప్రాజెక్ట్ తాలూకు షూట్ లో తలమునకలై ఉన్నాడు. ఇద్దరూ ఫ్రీ అయ్యాక పూర్తి స్థాయిలో రెగ్యులర్ షెడ్యూల్స్ లో ఎఫ్3 వీలైనంత త్వరగానే పూర్తి చేస్తారు. విడుదల వచ్చే దసరా పండుగకు ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదు. హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ లే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్యాస్టింగ్ కి సంబంధించి అనిల్ రావిపూడి ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. అఫీషియల్ స్టార్ట్ అయ్యాక క్లారిటీ వస్తుంది