iDreamPost
android-app
ios-app

సినిమా టికెట్ల దోపిడికి అడ్డుకట్ట పడనుందా

  • Published Sep 08, 2021 | 9:58 AM Updated Updated Sep 08, 2021 | 9:58 AM
సినిమా టికెట్ల దోపిడికి అడ్డుకట్ట పడనుందా

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఒక వెబ్ సైట్ తయారు చేయమని ఆదేశాలు జరీ చేస్తూ దానికి బాద్యులుగా కొందరు సభ్యులతో కూడిన కమిటీ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇది ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుతున్న పరిమాణం. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ చేస్తున్న అడ్డగోలు దోపిడీకి ఇన్నాళ్లు అలవాటు పడిన ఆడియన్స్ వేరే మార్గం లేక వాటిని భరిస్తూ వచ్చారు. ఒక టికెట్ మీద కనిష్టంగా 15 రూపాయలతో మొదలుపెట్టి పాతిక దాకా దండుకుంటున్న సంస్థలకు చెక్ పెట్టేందుకు కొందరు యాక్టివిస్టులు లీగల్ గా పోరాటలు చేశారు కానీ జాప్యం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగక ఏళ్ళు గడిచిపోతున్నాయి.

ఇది పక్కనపెడితే టికెట్ రేట్లతో థియేటర్ల యాజమాన్యాలు చేస్తున్న దందా మరో ఎత్తు. పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు టికెట్లను బ్లాక్ చేసుకుని వాటిని అధికధరలకు అమ్ముకుంటూ అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రైల్వే టికెట్ల తరహాలో గవర్నమెంటే అమ్మకాలు చేబడితే పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రాక్టికల్ గా ఇందులో ఎలాంటి సమస్యలు వస్తాయో అమలైతే కానీ అర్థం కాదు. ఇప్పుడీ వ్యవహారం కొన్ని వర్గాలకు మింగుడు పడటం కష్టమే. ఇన్నాళ్లు అలవాటు పడిన పద్ధతికి భిన్నంగా జనానికి మేలు జరుగుతుందంటే వాళ్లకు ఇబ్బందే.

తెలంగాణ సైతం ఇలాంటి ప్రతిపాదనలు ఎప్పుడో చేసుకుంది కానీ ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. సినిమా చూడటం అనేదే చాలా ఖరీదైన ప్రహసనంగా మారిపోయిన తరుణంలో ఇలాంటి చర్యలు చాలా అవసరం. థియేటర్లో అడుగు పెట్టినప్పటి నుంచి టికెట్ తో మొదలుకుని పాప్ కార్న్ దాకా ప్రతిదీ విపరీతమైన ఖర్చుకు బాధితుడిగా మారుతున్న ప్రేక్షకులకు ఇవి నిజంగా జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. హీరోలు కూడా విచ్చిలవిడిగా రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోయి నిర్మాతలకు వ్యయాన్ని పెంచే భారం కూడా తగ్గుతుంది. మరి ఏపి ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ ఆన్ లైన్ టికెటింగ్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి

Also Read: బాలకృష్ణ – చిరంజీవిల దాగుడుమూతలు!