iDreamPost
android-app
ios-app

తగ్గుతుందని అంచనా వేస్తే పెరిగింది..

  • Published Dec 09, 2020 | 12:09 PM Updated Updated Dec 09, 2020 | 12:09 PM
తగ్గుతుందని అంచనా వేస్తే పెరిగింది..

ఎత్తు తగ్గి ఉంటుందని అంచనావేసి కొలవడం ప్రారంభించారు. అంతా పూర్తయ్యాక చూస్తే గతంలో ఉన్న దానికంటే ఇంకొంచెం ఎత్తు పెరిగింది ఎవరెస్ట్‌ శిఖరం. 2015లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం కారణంగా ఈ పర్వతం ఎత్తు తగ్గి ఉంటుందని అంతా భావించారు. అయితే గతంలో ఉన్న కొలతల ప్రకారం 8848 మీటర్లు ఉన్న ఈ పర్వం అదనంగా పెరిగి ఇప్పుడు 8848.86 మీటర్లుగా నమోదైంది.

టెక్టానిక్‌ ఫలకాల వల్లే..

ప్రస్తుతం ఉన్న భూ భాగం మొత్తం తొమ్మిది వరకు టెక్టానిక్‌ ప్లేట్‌లపై విస్తరించి ఉందని చెబుతారు. ఇవే కాకుండా మరికొన్ని చిన్నతరహా ఫలకాలు, చిన్నచిన్న ఫలకాలను కూడా పరిశోధకులు గుర్తించారు. భూ భ్రమణం వల్ల ఈ ప్లేట్‌లు కొన్ని చోట్ల ఒకదానిలోకి ఒకటి చొచ్చుకు వస్తుంటుంది. ఈ క్రమంలో అక్కడ పర్వతాలు, లోయలు వంటివి ఏర్పడుతుంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

ఈ క్రమంలోనే భారత్‌ ఉన్న ఫలకం యురేసియస్‌ ఫలకంలోకి చొచ్చుకుని వెళ్ళడం ద్వారా హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయంటారు. ఈ చొచ్చుకునే క్రమం కొనసాగుతూ ఉండడంతోనే పర్వతాల ఎత్తుల్లో పెరుగుదల లేదా తగ్గుదల నమోదవుతూ ఉంటుంది. ముఖ్యంగా భూకంపాలు వంటివి వచ్చినప్పుడు ఈ మార్పులు గుర్తించేంత ఎక్కువగానే నమోదవుతాయి.

ఈ నేపథ్యంలో నేపాల్‌లో వచ్చిన భూకంపం కారణంగా ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తు తగ్గిందని అంతా అంచనా వేసారు. కానీ దానికి భిన్నంగా ఈ శిఖరం ఎత్తు పెరిగిందని ఇప్పుడు తేలింది. ఇకపై ఎవరెస్ట్‌ ఎత్తు ఎంత అంటే 8848.86 అని చెప్పాల్సి ఉంటుందన్నమాట.