iDreamPost
android-app
ios-app

Nellore corporation -అచ్చెన్నకు నెల్లూరు గుబులు..!

Nellore corporation -అచ్చెన్నకు నెల్లూరు గుబులు..!

మిగిలిన స్థానాల్లో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేషన్ ఇన్ చార్జిగా టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు కింజార‌పు అచ్చెన్నాయుడు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అక్క‌డ మ‌కాం వేశారు. కానీ స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు ఆయ‌న‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. అక్క‌డ 2014లోనే తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి పెద్ద ఆశాజ‌న‌కంగా లేదు. ఆ జిల్లా నుంచి కేవ‌లం మూడు సీట్లే గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో కూడా అక్క‌డ వైసీపీ స‌త్తా చాటింది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురైన ప‌రాభ‌వ‌మే నెల్లూరులో కూడా ఎదురైంది. చావుదెబ్బ తింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. గతంలో సాధించిన మూడు సీట్ల‌ను కూడా కోల్పోయింది. ఒక్క సీటు గెలవలేదు సరికదా, నెల్లూరు నగరం, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాలలో తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాలలోనూ భారీ తేడాతో ఆ పార్టీ అభ్య‌ర్థులు ఓడిపోయారు. దీంతో టీడీపీ అధ్వాన్న‌స్థితికి వెళ్లిపోయింది.

వ‌రుస ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత జిల్లాలో టీడీపీ త‌ర‌ఫున నిల‌బ‌డే నాయ‌కులు త‌గ్గిపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా క‌లిసి రాక‌పోతాదా అనే ఆశాదృక్ప‌థంతో కొంద‌రు ఏదోలా పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నారు. పార్టీ త‌ర‌ఫున‌, అధినేత త‌ర‌ఫున ఒకాల్తా పుచ్చుకుని అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. పార్టీని గ‌ట్టెక్కించేందుకు వారు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా క‌లిసిరావ‌డం లేదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలను వారిని నిరుత్సాహానికి గురి చేశాయి. జెడ్పీటీసీ స్థానాలను అయితే ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం సీట్లను ద‌క్కించుకుంది. టీడీపీ 6.13 శాతానికి పరిమితమైంది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న టీడీపీ శ్రేణులు కూడా స్త‌బ్దుగా మారిపోయారు. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ పోటీని టీడీపీ సీరియ‌స్ గా తీసుకుని అచ్చెన్న‌ను ఇన్ చార్జిగా నియ‌మించింది. రంగంలోకి దిగిన అచ్చెన్న పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్దామ‌నుకుంటే క‌లిసి వ‌చ్చే నాయ‌కులే క‌నిపించ‌డం లేదు.

జిల్లా టీడీపీలో చాలా గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల్లో సగం గ్రూపులు నెల్లూరు హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నాయి. ఇపుడు జరగబోయేది కూడా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలే కావటంతో నేతల్లో చాలామంది ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారట. కార్పొరేషన్ పరిధిలోని చాలామంది సీనియర్లను సంప్రదించకుండానే నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు మొత్తం టికెట్లను కేటాయించేశారట. అంటే కార్పొరేషన్లోని 54 డివిజన్లలోను తమకు కావాల్సిన వారికే వీళ్ళద్దరు టికెట్లను పంచేసుకున్నారన్నమాట. విషయం బయటపడటంతో మిగిలిన సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగేలా చేద్దామ‌ని అచ్చెన్న స‌మావేశం పెడితే.. రెండు గ్రూపుల నేతలు కూడా హాజ‌రుకాలేద‌ని తెలిసింది. దీంతో అచ్చెన్న అయోమయంలో ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో పార్టీని ఎలా గ‌ట్టెక్కించాలో తెలియ‌క అచ్చెన్నాయుడు గుబులు చెందుతున్నార‌ట‌.

Also Read : Nellore Corporation -నేతల తప్పులు.. నెల్లూరులో టీడీపీకి చిక్కులు