మేలు జాతి ఆవులకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రేష్టమైన ఆవులను కొనేందుకు పాడి రైతులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. వేలంలో ఎక్కువ లీటర్ల పాలు ఇచ్చే గోవులను కొనేందుకు అన్నదాతలు ఎగబడటాన్ని వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఎంత మేలు జాతి ఆవైనా.. ధర రూ.లక్షల్లోనే ఉంటుంది. కానీ ఒక ఆవు మాత్రం వేలంపాటలో రికార్డు ధర పలికింది. ఏకంగా రూ.కోట్ల ధర పలికి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ ఆవు ఎక్కడిదో కాదు.. మన నెల్లూరు జాతికి చెందినదే కావడం విశేషం. బ్రెజిల్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఒక వేలంలో నెల్లూరు జాతి ఆవు రూ.35 కోట్ల ధరకు అమ్ముడుపోయి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి కొన్ని దశాబ్దాల కింద పలు ఆవులను బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. వాటి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేశారు. అలాంటి ఒక నెల్లూరు జాతికి చెందిన తెల్ల ఆవు కోట్ల రూపాయలు పలికి ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా-19 ఎఫ్4 మారా ఇమ్విస్ అనే ఈ నాలుగున్న సంవత్సరాల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ.11.82 కోట్లకు అమ్ముడుపోయింది. గత సంవత్సరం ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ.6.5 కోట్లకు అమ్ముడవడం అప్పట్లోనే రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు అది బ్రేక్ అయింది.
మొత్తంమీద వియాటినా అనే ఈ ఆవు విలువ రూ.35.30 కోట్లు పలికింది. నాణ్యమైన జన్యు లక్షణాలు కలిగిన బ్రెజిల్‌లోని నెల్లూరు జాతి ఆవును దక్కించుకునేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దాని విలువను చాటిచెబుతోంది. ఇకపోతే, ప్రస్తుతం బ్రెజిల్లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయని సమాచారం. ఆ దేశంలో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. నెల్లూరు జాతికి చెందిన ఎద్దుల శ్రేష్టమైన వీర్యం అర మిల్లీలీటర్‌కు రూ.4 లక్షలు పలుకుతుండటం గమనార్హం. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం ఈ జాతి ఆవుల ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.