iDreamPost
android-app
ios-app

సాంస్కృతిక రాజధానిలో కళాసౌరభం

  • Published Mar 25, 2022 | 7:40 AM Updated Updated Mar 25, 2022 | 8:33 AM
సాంస్కృతిక రాజధానిలో  కళాసౌరభం

చారిత్ర‌క‌ నగరం,సాంస్కృతిక రాజధాని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో రెండురోజుల పాటు కన్నులపండువగా…కళా, నోరూరించే లా పాకశాస్త్ర మ‌హోత్స‌వం జరగనుంది. ఈ నెల 26, 27 తేదీల్లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో 12వ జాతీయ సంస్కృతీ మ‌హోత్స‌వాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, సినీ రంగ ప్ర‌ముఖులు హాజరు కానున్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఆర్ట్స్ క‌ళాశాల మైదానం కొత్త శోభ‌తో ఈమహోత్సవానికి వేదిక కానుంది.

రెండు రోజులు పండ‌గ

జాతీయ సంస్కృతీ మ‌హోత్స‌వంలో భాగంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రెండు రోజుల పాటు భార‌తదేశ మహోన్న‌త సంస్కృతీ, సంప్ర‌దాయ వార‌స‌త్వాన్ని ప్ర‌తిబింబించే కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. భిన్న‌త్వంలో ఏక‌త్వానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుక‌ల్లో తేట తెలుగు సంస్కృతి, క‌ళ‌ల క‌నువిందు, వంట‌కాల విందుల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల సంస్కృతీ వైభ‌వం, విశిష్ట‌త‌ను చాటిచెప్పే కార్య‌క్ర‌మాలూ జరుగుతాయి. ఏక్ భార‌త్-శ్రేష్ట భార‌త్ ల‌క్ష్యాలు, క‌ల‌లను సాకారం చేసే క్ర‌మంలో జాన‌ప‌ద‌, గిరిజ‌న క‌ళ‌లు, నృత్యం, సంగీతం, సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లతో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 500మందికి పైగా క‌ళాకారులు అల‌రించ‌నున్నారు.

తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో…

భార‌త‌దేశ విశిష్ట సంస్కృతి, వార‌స‌త్వ సంప‌ద ప‌రిర‌క్ష‌ణ‌, ప్రోత్సాహం, విస్తృత వ్యాప్తి ల‌క్ష్యంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జాతీయ సంస్కృతీ మ‌హోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది. ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా యువ‌త‌కు దేశ సాంస్కృతిక ఔన్న‌త్యాన్ని తెలియ‌జేసేందుకు ఈ వేడుక‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. దేశంలోని ఏడు జోన‌ల్ సాంస్కృతిక కేంద్రాల క్రియాశీల భాగ‌స్వామ్యంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ వేడుక‌ల‌ను ఏటా నిర్వ‌హిస్తోంది. 2015లో తొలి జాతీయ సంస్కృతీ మ‌హోత్స‌వ వేడుక‌లు న్యూఢిల్లీలో జ‌ర‌గ్గా.. 11వ ఉత్స‌వాల‌కు గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 14 నుంచి 28 వ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ ఆతిథ్య‌మిచ్చింది. ఈ ఏడాది 12వ జాతీయ సంస్కృతీ మ‌హోత్స‌వాలు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 వరకు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 26, 27 తేదీల్లో రాజమహేంద్రవరం; 29, 30 తేదీల్లో వరంగల్‌; ఏప్రిల్ 1 నుంచి 3 వరకు హైద‌రాబాద్‌లో వేడుక‌లు జ‌రుగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో మొద‌టిసారిగా జ‌రుగుతున్న ఈ ఉత్స‌వాల్లో దాదాపు వెయ్యి మంది క‌ళాకారులు, పాక‌శాస్త్ర నిపుణులు త‌మ నైపుణ్యాలను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. స్థానిక క‌ళా, జాన‌ప‌ద, నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయి. ఈ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి.

30 ఫుడ్ కోర్టుల్లో ఆయా ప్రాంతాల‌, స్థానిక ప్ర‌త్యేక వంట‌కాల ప్ర‌త్య‌క్ష త‌యారీ జ‌ర‌గ‌నుంది. అదే విధంగా ఏడు జోన్ల క‌ళాకారుల‌కు 70, స్థానిక క‌ళాకారుల‌కు 30 సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ల స్టాళ్ల‌ను కేటాయించడం జరిగింది. జాతీయ సంస్కృతీ మ‌హోత్స‌వాల నేప‌థ్యంలో గురువారం కాకినాడ‌లో క‌ళాకారుల‌తో శోభాయాత్ర నిర్వ‌హించ‌గా, శుక్ర‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో శోభాయాత్ర జరుగుతుంది.