iDreamPost
iDreamPost
పెరుగుతున్న సౌకర్యాలకు అనుగుణంగా అంతకంతా పెరిగిపోతున్న సినిమా టికెట్ ధర కేవలం 75 రూపాయలు కాబోతోందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ. కానీ ఇది నిజం. కాకపోతే చిన్న ట్విస్టు ఏంటంటే ఈ ఆఫర్ ఒక్క రోజుకే పరిమితం చేయబోతున్నారు. సెప్టెంబర్ 16 నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సులన్నీ కొత్త పాత తేడా లేకుండా అన్నింటికి ఇదే ధర ఇవ్వబోతున్నారు. అంటే దీనికి వారం ముందు వచ్చే బ్రహ్మాస్త్రను సైతం ఈ రేట్ తో ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఒకవేళ బుక్ మై షో లాంటి యాప్స్ ద్వారా బుకింగ్ చేసుకోవాలంటే ఆన్ లైన్ చార్జీలు భరించాలి.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, సిటీప్రైడ్, ఆసియన్, ముక్తా ఏ2, మూవీ టైం, వేవ్, ఎం2కె, డిలైట్ తదితర సంస్థలు ఇందులో పాలు పంచుకోనున్నాయి. దీనికి థాంక్ యు అనే పేరు పెట్టారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఏ సినిమా అయినా సరే కేవలం డెబ్భై అయిదు రూపాయలకు చూసేయొచ్చు. సింగల్ స్క్రీన్లను సైతం ఇందులో భాగం చేసే అవకాశం ఉంది. తమను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈ వెసులుబాటును తీసుకొస్తున్నట్టు అసోసియేషన్ పేర్కొంది. మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఈ పథకంలో 4000కి పైగా స్క్రీన్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇదేదో బాగుంది కానీ మరీ ఒక్క రోజుకే పరిమితం చేయడం వల్ల అందరికీ టికెట్లు దొరికే అవకాశాలు ఉండవు. పైగా కొత్త రిలీజులు తిరిగే టైం కాబట్టి బుకింగ్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. దానికి తోడు ఆన్ లైన్ మీద అవగాహన లేని సగటు ప్రేక్షకులకు అదే పనిగా థియేటర్ దాకా వెళ్లి ముందే కొనే ఛాన్స్ ఉండకపోవచ్చు. లేదూ షో టైంకు వెళ్లి తీసుకుందామన్నా దొరకడం జరిగే పనేనా. దీని బదులు నెలకో రెండు మూడు రోజులు డ్రై వీక్ డేస్ లో ఇలాంటివి అమలు చేస్తే ఆక్యుపెన్సీలు పెరిగి థియేటర్లు జనాలతో కళకళలాడటం చూడొచ్చు. యుఎస్ తదితర దేశాల్లోనూ దీన్ని పాటిస్తారు