Idream media
Idream media
పిల్లి ఒక చిన్న మూగ ప్రాణం. పల్లె నేపథ్యం నుంచి వచ్చిన ప్రతి వాళ్లకి పిల్లితో అనుబంధం వుంటుంది. నగర జీవితం పిల్లిని ఎప్పుడో ఒకసారి కనిపించే అపరిచితగా మార్చేసింది. తెలుగు భాషలో పిల్లి కోసం బోలెడు సామెతలు, మాటలు వాడుకలో వున్నాయి. బాధ ఏమంటే అవన్నీ నెగెటివ్ అర్థంలో వాడేవి. పిల్లి మంచితనం రైతులకి, చెడ్డతనం ఎలుకలకి మాత్రమే తెలుసు. మనుషులు కూడా కలుగుల్లోని ఎలుకల్లా మారుతున్నారు కాబట్టి వాళ్లకి పిల్లి ఒక దొంగ, విలన్.
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు , పిల్లిలా దొంగగా వచ్చాడు, దొంగ పిల్లి, పిల్లికి చెలగాటం ఇలా సామెతలు. తలుపులేసి తంతే పిల్లి పులిలా మారుతుంది, ఇది మంచి మాట. పిల్లికి కోపం వస్తే వళ్లంతా రోమాలు నిక్కపొడుచుకుని మీదకి దూకుతుంది.
పిల్లి నిజమైన మావో అనుచరురాలు. ఎప్పుడూ మావో మావో అని ఆయన్నే స్మరిస్తూ వుంటుంది. ఎలుకలు పంచెని కొడుతున్నాయని వెనుకటికి ఒక సాధువు పిల్లిని పెంచాడు. దాని పాల కోసం ఆవుని కొన్నాడు. గడ్డి కోసం వ్యవసాయం చేశాడు. సాయం కోసం పెళ్లి చేసుకున్నాడు. పిల్లి వల్ల సాధువు సంసారిగా మారాడు.
మనుషులే పిల్లికి ఎదురుగా వెళ్లి అపశకునం అనుకుంటారు. పిల్లి కూడా అదే అనుకుంటుందేమో! చంకలో పిల్లిని పెట్టుకున్నట్టు అంటారు కానీ, నిజానికి చంకలో పిల్లిని పెట్టుకుంటే ఎంత బాగుంటుందో పిల్లి ప్రేమికులకి తెలుసు.
గోడ మీద పిల్లి అని రాజకీయ నాయకుల్ని అంటారు. ఎలుకల్ని వేటాడుతూ పిల్లి బాధల్లో పిల్లి వుంటే మనం సామెతల వేటలో వుంటాం.
క్యాట్ కోర్స్ చదివితే మాత్రం ఎలుకలకి పిల్లి అర్థమవుతుందా? చదువుకి లివింగ్ స్కిల్స్‌కి సంబంధం లేదు. క్యాట్‌వాక్ అంటారు కానీ, మనుషుల కంటే పిల్లి అందంగా నడుస్తుంది.
పిల్లి మెడలో గంట కట్టే ప్రక్రియ ఆఫీసుల్లో నడుస్తోంది. బాస్‌ని అడిగేయాలి కడిగేయాలని గప్పాలు కొట్టి తీరా మీటింగ్‌లో నువ్వు అడుగు అంటూ ఎదుటి వాళ్ల వైపు చూస్తారు.
పిల్లి మ్యావ్ అంటుందని అందరికీ తెలుసు. ఒకే మ్యావ్‌ని అనేక వైబ్రేషన్స్‌తో పలుకుతుందని పెంచిన వాళ్లకి మాత్రమే తెలుసు. మూడ్‌ని బట్టి మ్యావ్ వుంటుంది.
భార్య ముందు పిల్లిలా వుంటాడనే మాట అమాయకపు భర్తలకి వాడుకలో ఉంది. కానీ పిల్లికి ప్రత్యేక వ్యక్తిత్వం వుంటుంది. లొంగుబాటు ప్రాణి కాదు. తానే యజమానిని అనేంత దర్పం.
పిల్లి అంటే వెంటనే గుర్తొచ్చేది ఉషాజ్యోతి బంధం. ఈ అమ్మాయి హైదరాబాద్‌లో వుంటారు. ప్రముఖ చిత్రకారుడు మోషే సహచరి. నాకు పరిచయం లేదు కానీ, ఫేస్‌బుక్‌లో బాగా పరిచయం. పిల్లులంటే ఆమెకిష్టం, ప్రేమ, ప్రాణం. వీధి పిల్లుల్ని చేరదీస్తుంది. తెలుసుకుంటుంది. పిల్లుల గురించి చదువుకుంటుంది. ఆదరించడమే కాదు , అనారోగ్యంతో వున్న వాటిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తుంది.
తాము బాగుంటే చాలనుకునే సంక్లిష్ట ప్రపంచంలో పిల్లికి కూడా బతికే హక్కు ఉందని నమ్మే వ్యక్తి. పిల్లికి నొప్పి కలిగితే ఆమె బాధ పడుతుంది. పిల్లికి దుక్కం వస్తే ఆమెకి కన్నీళ్లు వస్తాయి. పిల్లితో ఆమె ఫొటోలు చూస్తే ఇద్దరి ఆత్మ ఒకటే అనిపించేంత గాఢత. పిల్లి కోసం ఒక సంస్థనే ప్రారంభించిన ఉష మన మధ్య తిరిగే మంచితనం, గొప్పతనం.
(అక్టోబర్ 29, జాతీయ పిల్లుల దినోత్సవం)