iDreamPost
android-app
ios-app

ఆ ఐదేళ్లూ ఓ లెక్క‌.. ఈ రెండేళ్లూ మ‌రో లెక్క‌..!

ఆ ఐదేళ్లూ ఓ లెక్క‌.. ఈ రెండేళ్లూ మ‌రో లెక్క‌..!

2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టిన న‌రేంద్ర మోదీ.. 2014 మే 26న భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అక్క‌డి నుంచి 2019 వ‌ర‌కూ ఐదేళ్ల కాలం ప్ర‌ధాన‌మంత్రిగా కొన‌సాగిన ఆయ‌న ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో కూడా విజ‌య‌విహారం చేశారు. 2019 మే 30వ తేదీ న మ‌రోసారి భారతదేశ ప్రధానమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ రెండో పర్యాయం పదవీకాలం ప్రారంభం అయింది.

అంత‌కు ముందు 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన నరేంద్రమోదీ కి, ఆ రాష్ట్రాని కి సుదీర్ఘ సమయం పాటు సేవ చేసిన తొలి ముఖ్యమంత్రి గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ త‌ర్వాత 2014లోను, 2019వ సంవత్సరం లోను జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కి రికార్డు స్థాయి లో విజయాలను అందించారు. ఈ రెండు ఎన్నికల లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ ని సాధించింది. తొలి ఐదేళ్ల‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. సంచ‌ల‌న పాల‌సీలు తీసుకొచ్చారు. వాటిలో 500, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అధికరణ 370 రద్దు, మూడు సార్లు తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అమలు వంటివి ఉన్నాయి. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి బీజేపీకి బంప‌ర్ మెజార్టీ అందించి మోదీ నిర్ణ‌యాల‌కు ప్ర‌జ‌లు సానుకూలంగానే ఉన్నార‌న్న సంకేతాలు ఇచ్చారు. “సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్” మంత్రం తో సమ్మిళితమైన, అభివృద్ధి ప్రధానమైన, అవినీతి రహితమైన పాలన ను అందించే దిశ గా కొత్త మార్పు కు శ్రీకారం చుట్టారని పేరు పొందారు. అందుకే ఆయ‌న‌కు మ‌రోసారి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు.

2019 మేలో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన మోదీ.. నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రెండేళ్ల కాలంలో కూడా అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే, వాటిపై కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌న్న ఇటీవ‌ల వెల్ల‌డైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల ద్వారా తెలుస్తోంది. అలాగే, సాగు చ‌ట్టాలు, ప్రైవేటీక‌ర‌ణ విధానాలు, క‌రోనా రెండో ద‌శ క‌ట్ట‌డిలో వైఫ‌ల్యం చెందార‌నే అభియోగాలు మోదీ ఎదుర్కొంటున్నారు. క‌రోనా తొలి ద‌శ‌లో మోదీ లాంటి వ్య‌క్తి ప్ర‌ధానిగా ఉండ‌డం వ‌ల్లే స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అత్య‌ధిక మంది ప్ర‌జ‌ల మ‌న‌సు చుర‌గొన్న మోదీ.. దేశంలో కరోనా కల్లోలానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం అని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. సెకండ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించినా మోడీ బృందం పెడచెవిన పెట్టిందని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కుంభమేళా లాంటి వాటి వల్ల దేశంలో కరోనా జెట్ స్పీడుగా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

వ్యాక్సినేష‌న్ లో బీజేపీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప్రధాని మోదీకి వ్య‌తిరేకంగా ఢిల్లీలో పోస్ట‌ర్లు సైతం వెలిశాయి. కరోనా మొదటి ద‌శ‌లో యావత్ దేశానికి దిశానిర్దేశం చేసే నాయకుడిగా కనిపించిన నరేంద్రమోదీ, రెండో ద‌శ‌లో విమ‌ర్శ‌ల పాల‌య్యార‌న్న విష‌యం ఈ సంఘ‌ట‌న‌తో అర్థ‌మ‌వుతోంది. మొదటి దశకు, రెండవ దశకు మధ్య లభించిన సమయాన్ని సమర్థమైన వ్యూహరచనకు, మౌలిక సదుపాయాల వృద్ధికి ఉపయోగించకుండా, రాజకీయ ప్రయోజనాల మీదనే దృష్టి పెట్టారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. నిపుణుల మాటలు, క్షేత్రస్థాయిలో ఉన్నవారి మాటలు, శాస్త్రజ్ఞుల సలహాలు… వినకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వ్యాఖ్యలు వినిపించాయి. వ్యాక్సిన్ లు, ప్రాణ‌వాయువు కొర‌త‌ను అధిగ‌మించ‌డంలో వెనుక‌బ‌డ్డార‌నే విమ‌ర్శ‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫ‌లితంగా వ్య‌తిరేక ఫ‌లితాలు రావ‌డ‌మే కాకుండా, మోదీ గ్రాఫ్ కూడా త‌గ్గుతూ వ‌స్తోంది. ఇదంతా ప‌రిశీలిస్తే ఏడేళ్ల బీజేపీ పాల‌న‌లో మొదటి ఐదేళ్ల కాలం ఓ లెక్క‌గా, ఆ త‌ర్వాత రెండేళ్ల కాలంగా మ‌రో లెక్క అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : ఆరు నెలల రైతు ఉద్యమం, రాబోయే ఎన్నికలపై బీజేపీలో మొదలయిన చర్చ