iDreamPost
android-app
ios-app

ట్విస్ట్ : నితీష్ స్కాంల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మోదీ..!

ట్విస్ట్ : నితీష్ స్కాంల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మోదీ..!

అదేంటి.. నితీష్‌పై మోదీ ఆరోప‌ణ‌లు చేయడం ఏంటి..? బిహార్ ఎన్నిక‌ల్లో బీజేపీ – జేడీయూ క‌లిసే పోటీ చేస్తున్నాయి క‌దా..! తొలి విడత పోలింగ్ త‌ర్వాత ఏమైనా విడిపోయాయా..!! అస‌లేం జ‌రిగింది..!! ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? కాస్త రిలాక్స్ అవ్వండి.. అస‌లు విష‌యం ఏంటంటే.. రెండో విడత సమరానికి బిహార్‌ రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. శనివారం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జేడీయూ ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. కేవలం అధికారం కోసమే ఇరు పార్టీలు జట్టుకట్టాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికలో సమయంలో నితీష్‌పై మోదీ ఆరోపణలు చేసిన ఓ వీడియోను ట్విటర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మొత్తం 243 స్థానాలకు గానూ.. 16 జిల్లాల్లో విస్తరించిన 71 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు పూర్త‌య్యాయి. ఇక రెండో ప్ర‌చారంలో వ్యూహాత్మ‌కంగా కూట‌ములు దూసుకెళ్తున్నాయి.

క‌ల‌క‌లం రేపుతున్న వీడియో

ఈ వీడియోలో మోదీ మాట్లాడుతూ.. నితీష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ‘నితీష్‌ హాయంలో బిహార్‌ మరింత వెనుకబడుతోంది. జేడీయూ పాలనలో అవినీతి తారా స్థాయికి పెరిగిపోయింది. గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఐదేళ్ల పాలనలో నితీష్‌ కుమార్‌ 60 స్కాములకు పాల్పడ్డారు. వాటి విలువ దాదాపు 30 వేలకోట్లు. బీజేపీ అధికారంలోకి వస్తే వాటిపై విచారణకు ఆదేశిస్తాం’ అంటూ మోదీ ఆరోపించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ,ఆర్జేడీ, కాంగ్రెస్‌ మహా కూటమిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్‌.. వారితో బంధానికి ముగింపు పలికి మహా కూటమితో చేతులు కలిపారు. అనంతం కొంత కాలనికే కూటమితో తెగదెంపులు చేసుకుని మరోసారి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే నితీష్‌ను ఇరుకున పెట్టేందుకు తేజస్వీ గత వీడియోను బయటపెట్టారు. ఇదీ నితీష్‌ స్వరూపం అంటూ ఆర్జేడీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు.