iDreamPost
android-app
ios-app

ఒక్కసారి గుర్తు చేసుకోండి లోకేష్ బాబు..!

ఒక్కసారి గుర్తు చేసుకోండి లోకేష్ బాబు..!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‘రైతు కోసం తెలుగుదేశం’ అంటూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నివర్‌ తుఫాను దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆ పార్టీ చెబుతోంది. నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించిన నారా లోకేష్‌.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. త్రిపురాంతకం మండలం ఉమ్మడివరం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకంటూ లోకేష్‌ బయలుదేరారు. నివర్‌ తుఫాను వచ్చి పోయి దాదాపు నెల రోజులువుతోంది. పంటలు దెబ్బతిన్న సమయంలో పరిశీలించేందుకు రాని లోకేష్‌.. ఇప్పుడు మళ్లీ పంటలు వేసుకున్న సమయంలో రావడం వెనుక లక్ష్యం ఏమిటో రైతులకు తెలియంది కాదు.

వైసీపీ ప్రభుత్వం నివర్‌ తుఫాను వల్ల జరిగిన పంట నష్టాన్ని ఇప్పటికే అంచనా వేసింది. పంట నష్టపోయిన వారికి పెట్టుబడి రాయితీ ఈ రోజు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తుఫానులు, ప్రకృతి వైపరిత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నెల రోజుల్లోపే ఇచ్చిన జగన్‌ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై నెల రోజుల్లోనే రైతులకు పరిహారం అందనుంది. ఈ మేరకు మంత్రివర్గం విధాన నిర్ణయం కూడా తీసుకుంది. పంటలు వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలను కూడా ప్రభుత్వం అందించింది. ప్రకాశం జిల్లాలో శెనగ, పొగాకు, మినుము, కంది, బొబ్బర్లు, వరి తదితర 20 రకాల పంటలు 78,388 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. వివరాలు సేకరించిన ప్రభుత్వం 1.12 లక్షల మంది రైతులకు 87.70 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ నగదు వారి ఖాతాల్లో జమ చేసింది.

గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు నాడు రైతులకు ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంది గుర్తు చేయాల్సిన పనిలేదు. హుద్‌ హుద్, తిత్లీ తుఫాను బాధితులకు ఎంత మేర పరిహారం, ఎప్పుడు ఇచ్చారన్నది ఉత్తరాంధ్ర ప్రజలకు ఇప్పటికీ ఎరుకే. నివర్‌ తుఫాను బాధితులకు ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద 500 రూపాయల సాయం జగన్‌ప్రభుత్వం అందించగా.. నాడు చంద్రబాబు ప్రభుత్వం తిత్లీ, హుద్‌హుద్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గ్రామానికి 500 రూపాయలు ఇచ్చిన ఘనత సొంతం చేసుకుంది. ఈ విషయం తన తండ్రి చంద్రబాబుకు ఒకనాటి పార్టనర్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ను లోకేష్‌బాబు అడిగినా చెబుతారు.

పంట నష్టం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాలు, పెట్టుబడి రాయితీతో మళ్లీ పంట వేసుకున్న తర్వాత పశ్చిమ ప్రకాశం జిల్లాకు వచ్చిన నారా లోకేష్‌కు నిజంగా రైతులు, వ్యవసాయంపై చిత్తశుద్ధి ఉంటే.. వెలుగొండ ప్రాజెక్టుపై రైతులతో మాట్లాడాలి. వెలుగొండ ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్న తనకు తానుగా వేసుకుని సమాధానం చెప్పాలి. తన తండ్రి ముఖ్యమంత్రి, తాను గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న టీడీపీ ప్రభుత్వ హాయంలో వెలుగొండ ప్రాజెక్టుపై ఏమి చెప్పారు..? ఏమి చేశారన్నది ఇంకా పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు మరచిపోలేదు. కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశం వాసుల తాగు, సాగునీటికి ఏకైక ఆధారమైన వెలుగొండ ప్రాజెక్టుపై నాడు తన తండ్రి చంద్రబాబు చెప్పిన మాటలు ఈ రోజు లోకేష్‌ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఐదేళ్లలో మాటలు తప్పా ప్రాజెక్టు పూర్తిపై శ్రద్ధపెట్టలేదని ఆయన వివిధ సందర్భాల్లో ప్రజల సాక్షిగా మాట్లాడిన మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. 2015 మార్చి 14వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వచ్చిన చంద్రబాబు… వెలిగొండ ప్రాజెక్టును 2016 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. మళ్లీ మరుసటి ఏడాది అంటే.. 2016 ఏప్రిల్‌ 16వ తేదీన మార్కాపురం పర్యటనకు వచ్చి ఈ సారి 2017 చివరి నాటికి వెలిగొండ పూర్తి చేస్తామన్నారు. ముచ్చటగా మూడోసారి 2018 జనవరి 2వ తేదీన దర్శి పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును 2018 జూన్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. 2018 ఏప్రిల్‌లో కందుకూరు వచ్చిన సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును 2018 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తానన్నారు. ఇక చివరగా.. 2018 జూలై 28న ఒంగోలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. ఈ సారి వెలిగొండ ప్రాజెక్టును 2019 సంక్రాంతి నాటికి పూర్తి చేస్తానన్నారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై తన తండ్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక సారి లోకేష్‌ గుర్తు చేసుకుంటే.. రైతులు, వ్యవసాయం పట్ల ఎవరి చిత్తశుద్ధి ఏమిటిన్నది అవగతమవుతుంది. చేయగలిన రోజుల్లో మాటలతో కాలం వెల్లబుచ్చి.. నేడు రైమింగ్‌ పదాలతో.. రైతు కోసం తెలుగుదేశం అంటూ.. విమర్శలతో కూడిన రాజకీయాల వల్ల రైతులకు, వ్యవసాయానికి ఏ మాత్రం ఉపయోగపడవన్న విషయం మాజీ మంత్రివర్యులు మనసులోనైనా తలుచుకుంటే కరువు ప్రాంత వాసులకు అదే పదివేలు.