iDreamPost
android-app
ios-app

ఆ వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళతారట.. రాసిపెట్టుకోమంటున్న లోకేష్‌..

ఆ వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళతారట.. రాసిపెట్టుకోమంటున్న లోకేష్‌..

కరోనా భయంతో ఏపీని వదిలి హైదరాబాద్‌లోని రాజభవనానికే పరిమితమైన మాజీ మంత్రి, టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. అప్పుడప్పుడు బయటకు వచ్చినా కూడా మీడియాకు ఫీడ్‌ ఇచ్చివెళుతున్నారు. అన్నీ రాసిపెట్టుకుంటున్నాం.. వడ్డీతో సహా వైసీపీ నేతలకు చెల్లిస్తామని గతంలో హెచ్చరించిన నారా లోకేష్‌.. తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళతారని, కావాలంటే రాసిపెట్టుకోండంటూ నొక్కివక్కానించారు. ప్రజల వద్ద ఎకరం భూమి ఐదు లక్షల రూపాయలకు కొని ప్రభుత్వానికి 50 లక్షల నుంచి కోటిన్నర రూపాయల చొప్పన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విక్రయించారని నారా లోకేష్‌ ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై త్వరలో సీబీఐ విచారణ కూడా జరగబోతోందని నారా లోకేష్‌ చెప్పారు. ఇళ్ల స్థలాలకు భూములు కొన్న విషయంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఇప్పటికే ఆయా భూములపై సీబీఐ విచారణ ఎందుకు వేయకూడదని హైకోర్టు వ్యాఖ్యానించిందంటూ లోకేష్‌ పేర్కొన్నారు. తక్కువ ధరకు భూములు కొన్న ఎమ్మెల్యేలు ఎక్కువ రేట్లకు ప్రభుత్వానికి విక్రయించినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ఆ 40 మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళతారని చెబుతున్నామన్నారు.

వాళ్ల పార్టీ అధినేత, ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లి వచ్చారని, అందుకే తాము వెళ్లి వస్తామని ఆ ఎమ్మెల్యేలు అంటున్నారని లోకేష్‌ శూన్యంలోకి రాయి విసిరారు. ఆధారాలు ఉంటే లోకేష్‌ ఇంకా ఫిర్యాదు ఎందుకు చేయలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూముల కొనుగోళ్లపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకు తన వద్ద ఉన్న ఆధారాలను ఇచ్చేందుకే వాటిని ఇంకా బయటపెట్టలేదా..? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజంగా ఆధారాలు ఉంటే సింహభాగం పత్రికలు, టీవీ ఛానెళ్లలో ఇప్పటికే కథనాలతో హోరెత్తించేవారు కదా..? అనే సందేహాలు కూడా లోకేష్‌ మాటలు విన్న వారిలో కలుగుతున్నాయి. ఏమైనా లోగుట్టు లోకేష్‌కే ఎరుకనేలా మాజీ మంత్రి తమకు మంచి న్యూస్‌ ఫీడ్‌ ఇచ్చారని మీడియా ప్రతినిధులు సంబరపడిపోతున్నారు.