iDreamPost
iDreamPost
చిన్నపిల్లలు ఆటల్లో భాగంగా ఒకరిపై ఒకరు గట్టిగానే పోట్లాడుతుంటారు. ఒక్కోసారి బాగానే ఆటపట్టించేస్తుంటారు. ఆ సమయంలో అక్కడున్న పెద్దాళ్ళెవరైనా పాపం ఊరుకోండర్రా.. చిన్నాడ్ని మరీ అంతలా ఆడించేయకూడదు అనడం సహజంగా అన్ని ఇళ్ళలోనూ విన్పిస్తూనే ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో కూడా ఇప్పుడిలాంటి సీను పదేపదే కన్పిస్తోంది. కానీ ‘పాపం.. ఊరుకోండర్రా’ అనే పెద్దమనుషులే కన్పించడం లేదు.
పాపం తాను మాట్లాడే విషయం గురించిగానీ, మాట్లాడదామనుకుంటున్న అంశం గురించి గానీ ఏ మాత్రం పెద్దగా విషయ పరిజ్ఞానం లేకుండానే ఏపీకి చినబాబుగా పేరుగాంచినాయన మైకు ముందుకొచ్చేస్తున్నాడు.. సారీ ‘ట్వీటు’ ముందుకొస్తున్నాడు. మొన్నటి వరకు మైకు ముందుకొచ్చినప్పుడు ఏ స్థాయిలో ఎంటర్‌టైన్ చేసారో… ఇప్పుడీ ట్వీటు ముందుకొచ్చినా గానీ తనపై అంచనాలను ఏ మాత్రం తగ్గనీయడం లేదాయన. ఎవరో? అన్నది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండానే నారా లోకేష్ అన్నది ఇట్టే అర్ధమైపోతుందీ విషయాలు చూడగానే.
తాజాగా ఇప్పుడు మళ్ళీ మరొక్కమారు సోషల్ మీడియాలో విస్తృత ట్రోలింగ్‌కు గురయ్యాడీ చినబాబు. రాష్ట్ర ప్రభుత్వం నేచురల్ గ్యాస్ మీద వ్యాట్‌ను పెంచినట్లు ప్రకటించింది. విషయం బైటకు వచ్చిన వెంటనే లోకేష్‌బాబు ట్వీట్టర్ అందుకున్నారు. ఆసరా, టోకరా.బకరా..అంటూ ప్రాస కూడా వాడి ట్వీట్ చేసారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటిగా భావించి అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా పథకాన్ని చిన్నబుచ్చడంతోపాటు, ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన ధ్యేయంగా ఈ ట్వీటు సాగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గత పదిహేను నెలల నుంచి చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగానే ఇటువంటి కామెంట్లు, ట్వీట్లు, ప్రెస్‌మీట్లు అన్నది అధికార పక్షం మొదట్నుంచి ఆరోపిస్తోంది.
ఇదిలా ఉండగా తాజా ట్వీట్ నేపథ్యంలో నెటిజన్లకు లోకేష్ బాగా దొరికిపోయారు. మహిళలు ఇళ్ళలో వాడే లిక్విడ్ పెట్రోలియంగ్యాస్ (ఎల్‌పీజీ) కి నేచురల్ గ్యాస్‌కు తేడా తెలియకపోతే ఎలా? లోకేష్‌బాబూ అంటూ ట్రోలింగ్ చేయడం మొదలెట్టేసారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ చేసిన ప్రతి పనిని విమర్శనాత్మక దృష్టితోనే చూస్తున్న లోకేష్ అండ్ బృందం వెనకా ముందు చూసుకోవడం లేదన్న సంగతి ఈ విషయం ద్వారా సుష్పష్టమైపోయిందన్నది తేలింది. తండ్రితో సహా పార్టీ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకున్న లోకేష్‌బాబు ఈ విధంగా ‘తేడా’ తెలియని ట్వీట్లు చేస్తుంటే వారంతా తీవ్ర అయోమయంలో పడతారని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న సొంత పార్టీ నేతలకు ఇటువంటి ట్వీట్లు మరింత ఇబ్బందికర పరిస్థితిని తెస్తాయనడంలో సందేహం లేదు.
ఒక్కొక్క సారి సదరు ట్వీట్స్‌లో పెట్టే మెస్సేజ్‌ల నాణ్యతను చూస్తే ఖచ్చితంగా ట్విట్టర్‌ఖాతాను లోకేష్‌బాబు స్వయంగా నిర్వహించరేమోనన్న సందేహం ఇప్పటికే ఆయన ప్రత్యర్ధుల్లో ఉంది. ఎలాగూ గత ఆరేడు నెలలుగా జనానికి, పార్టీ నాయకులకు పూర్తిగా దూరంగా ఉన్నారు. జనంతో సంధానం అయ్యేందుకు ప్రధానంగా వాడుకుంటున్న ట్విట్టర్, జూమ్‌లలో కూడా ఇటువంటి పసలేని కామెంట్లు చేస్తే వాటిని చూసేవారు కూడా కరువవుతారని ప్రత్యర్ధి పార్టీ నాయకులు జోకులేసేస్తున్నారు. ట్వీటు చేసిందే తడవుగా మొదటి పేజీలో అచ్చేసే అనుంగు మీడియా కూడా జరిగిన ఘనకార్యాన్ని గమనించి సదరు ట్వీట్ ప్రచురణకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రస్తుత సంఘటన నేపథ్యంలో మున్ముందు చినబాబు ఎంత జాగ్రత్తగా ట్వీట్లు చేస్తారో వేచి చూడాలి.