iDreamPost
android-app
ios-app

అంత వరకూ లోకేష్‌ ఆగలేకపోతున్నారా..?!

అంత వరకూ లోకేష్‌ ఆగలేకపోతున్నారా..?!

నారా లోకేష్‌.. ఏపీ రాజకీయాల్లో ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శాసన సభకు ఎన్నిక కాకపోయినా.. తన తండ్రి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఘనతను సొంతం చేసుకున్న చరిత్ర నారా లోకేష్‌ది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికవుదామని ప్రయత్నించినా.. మంగళగిరి ప్రజలు మొండిచేయి చూపారు. అమరావతిని అభివృద్ధి చేశామని, ఆస్తుల విలువలు పెంచామనే భావనతో మంగళగిరి అయితే విజయం సులువుగా దక్కుతుందనుకున్న లోకేష్‌ ఆశలు అడియాశలయ్యాయి. ఓటమిని నారా లోకేష్‌ జీర్ణించుకోలేకపోయారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..? పోటీ చేసి ఎమ్మెల్యే అవుదామా..? అనే ఉత్సకత నారా లోకేష్‌లో బాగా ఉన్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

లోకేష్‌ ఆశలు కూడా దానిపైనే..

గత ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలందరూ జమిలీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంపై సానుకూలమనే వార్తలు ప్రతిపక్ష పార్టీల నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే.. 2019 ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే జమిలీ ఎన్నికల పాట పాడడం మొదలుపెట్టారు. అధికార దాహంతోనా.. లేక భవిష్యత్‌పై క్లారిటీ వచ్చి జారిపోతున్న నేతలను కాపాడుకునేందుకా..? ఏమైతేనేం బాబు తరచూ జమిలీ జపం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు కూడా జమిలీ ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు 2022లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయని, జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయం అంటూ కూడా జోస్యం చెబుతున్నారు.

ఈ సారి అయినా ఆశ ఫలిస్తుందా..?

జమిలీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న నారా లోకేష్‌.. ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? మళ్లీ మంగళగిరి నుంచే పోటీకి దిగుతారా..? లేక మరేదైనా సేఫ్‌ నియోజకవర్గం ఎంచుకుంటారా..? అనే ప్రశ్నలు లోకేష్‌ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడడంతో కలుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలోని మంగళగిరి నుంచి పోటీ చేసినా.. లోకేష్‌ ఓటమిపాలయ్యారు. మళ్లీ అక్కడ నుంచే పోటీ చేసే సాహసం చేస్తారా..? అనే అంశంపై తమ్ముళ్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2022 అంటే.. మరో రెండేళ్ల సమయం ఉంది. అంటే అప్పటికి వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల కాలం పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ తాను ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశారు. మరో రెండున్నరేళ్లలో అన్ని పథకాల ద్వారా ప్రజలు పూర్తి స్థాయిలో లబ్ధి పాందుతారు. 2019లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. మరి ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా లబ్ధిపొందుతున్న ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఎవరైనా అంచనా వేయగలరు. మరి లోకేష్‌ ఏ అంచనాలతో జమిలీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Read Also : సమ న్యాయం పాటిస్తున్న సీఎం జగన్‌