iDreamPost
iDreamPost
సరిగ్గా నాలుగున్నరేళ్ళ క్రితం ఇదే మనిషిని అరెస్టు చేసి అమరావతి గ్రామాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పి తీవ్ర హింసలకు గురిచేస్తున్న రోజుల్లో లేవని గొంతులు తమకోసం ఇప్పుడు ఈ మనిషిని నిలదీయడం ఎంతవరకు సముచితం!?
భూసమీకరణతో వేలాది రైతుకూలీలకు ఉపాధి పోతుందన్న భయంతోనే కదా వారిలో ఒకడిగా పోరాటాల్లో అగ్రభాగాన ఉన్నాడు? అలా అగ్రభాగాన ఉన్నందుకేగా అరటితోటలో మంటపెట్టాడనే ఆరోపణతో “అరెస్టు” చేశారు? అలా “అరెస్టు” చేసి వరుసగా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ, తీవ్రంగా హింసిస్తూ ఉంటే ఇదే గ్రామాల రైతుల గొంతులు లేచాయా? ఇది అన్యాయం అన్నాయా ఆ గొంతులు? పిడికిలి బిగించాయా ఆ చేతులు?
ఈ రోజువారీ కూలీ కుర్రోడు ఈ రైతుల పొలాల్లో పనిచేసినవాడేగా? ఈ రైతులెవరూ అయ్యోపాపం అనేలేకపోయారేం? “మాఊరి కుర్రోడే వదిలేయండి” అని ముఖ్యమంత్రి బాబుగారికి ఒక్కరూ చెప్పలేదే? ఈ అమరావతి గ్రామాల రైతులు సరే, పక్కనున్న నందిగామ వాసులకేం పని? అమరావతిలోని మనవాళ్ళకోసమా? ఆ మనవాళ్ళలో నాడు ఈ సురేష్ లేడనేగా అప్పుడు మాట్లాడలేదు?!
ఇప్పుడు ఇలా గులాబిపువ్వులు ఇచ్చేముందు అయినా అప్పట్లో ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఖండించే ప్రయత్నం అయినా చేసుండొచ్చుగా? ఆమాత్రం సౌభ్రాతృవం లేకపోబట్టే కదా “అమరావతి”పై అందరికీ సానుభూతి కలగడం లేదు? అందుకే కదా “అమరావతి పోరు” ఒక వర్గం రైతుల పోరుగా, ఒక వర్గం మీడియా వార్తగా, ఒక వర్గం రాజకీయ అంశంగా మిగిలిపోయింది!?
ఆలోచించండి. పక్కవాళ్ళు బ్రతుకు పోరాటం చేస్తున్నప్పుడు మనం ఎక్కడున్నాం? తోటి మనుషులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, వాళ్ళు గొంతెత్తి సహాయంకోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు మన గొంతులేమయ్యాయి? మనం ఎవరి పోరాటానికైనా మద్దతిచ్చామా? ఎవరి అన్యాయాన్నైనా ఖండించామా? ఎవరి జండా అయినా పట్టుకున్నామా? ఎవరి దీక్షా శిబిరం అయినా సందర్శించామా? ఇవేమీ మనం చేయకుండా, ఇప్పుడు మనకోసం జనం అంతా గొంతెత్తాలి అంటే ఎలా?
ఇతరుల బాధ మనది కానప్పుడు, మన బాధ ఇతరులదెలా అవుతుంది? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇల్లూ అంతే దూరం కదా?