Idream media
Idream media
తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్‌పై అధికార పార్టీ టీఆర్‌ఎస్ తన ఎఫెర్ట్ మొత్తం పెడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోని టీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ నాగార్జునసాగర్‌ను మాత్రం అన్ని వైపుల నుంచీ మధిస్తున్నారు. ప్రత్యేక టీం, వారిపై నిఘాకు మరో టీం.. ఇలా గెలుపే ధ్యేయంగా వ్యూహాత్మక విధానాలు అవలంబిస్తున్నారు. రేస్‌లో ముందుండడానికి చేయాల్సినవన్నీ ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో సీఎం బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, దుబ్బాక, గ్రేటర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్న బీజేపీ నాగార్జునసాగర్ వద్దకు వచ్చేసరికి ఆ స్థాయి వేగంతో దూసుకెళ్లడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు అభ్యర్థి కారణమని కొందరు, కాంగ్రెస్ నుంచి కూడా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ పండితుడు పోటీలో ఉండడం కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక బండి సంజయ్‌కు అసలు సిసలు పరీక్షగా భావిస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఎత్తులు, పై ఎత్తులతో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్‌లో జరిగింది. చివరకు బీజేపీ విజయం సాధించి భవిష్యత్ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరింది. దానికి తగ్గట్టుగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మహామహులను రంగంలోకి దింపి ప్రచార పర్వాన్ని రక్తి కట్టించింది. 48 స్థానాలను సాధించింది. టీఆర్‌ఎస్ కంటే కేవలం 8 స్థానాలే తక్కువ. అన్ని సీట్లు వస్తాయని బహుశా బీజేపీ నేతలు కూడా ఊహించి ఉండరు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు చోట్లా గట్టి పోటీనే ఇచ్చింది. అదే ఊపును నాగార్జున సాగర్‌లోనూ కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెప్పారు. కానీ, ఆ స్థాయిలో అక్కడ బీజేపీ ప్రచార శైలి ప్రస్తుతానికి కనిపించడం లేదనేది వాస్తవం.
దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయానికి అభ్యర్థిగా నిలిచిన రఘునందన్ రావే ప్రధాన కారణం అని చెప్పి తీరాల్సిందే. యువతలో ఆయనకున్న ఫాలోయింగ్, ప్రసంగాలపై పట్టు, సుదీర్ఘ కాలంగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం దుబ్బాకలో కాషాయ జెండా ఎగరడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. కానీ నాగార్జున సాగర్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ బీజేపీలో పేరు మోసిన నేతలెవరూ లేరు. దుబ్బాకలో గెలిచినంత ఈజీగా, గ్రేటర్‌లో కారు స్పీడుకు బ్రేకులు వేసినట్టుగా సాగర్‌లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
సాగర్ బీజేపీ అభ్యర్థి పి.రవికుమార్ నాయక్‌కు ఇదే తొలి ఎన్నిక. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. విపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వెనుకబడి ఉన్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. పైగా సీటు పంపకాల్లో ఏర్పడ్డ లొల్లి బీజేపీకి అవరోధంగా మారుతోంది. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కడారు అంజయ్య యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా సాగర్ బరిలో దిగిన అంజయ్యయాదవ్ 27వేల ఓట్లు సాధించి జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నివేదితా రెడ్డి స్తబ్దుగా ఉన్నారు. దీంతో ఇక్కడ బండి సంజయ్ అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. హోం మంత్రి అమిత్ షాను కూడా ప్రచారానికి తీసుకురానున్నారు. ఆ తర్వాత ఏమైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి.