Idream media
Idream media
అక్టోబర్ 11, అమితాబ్ పుట్టిన రోజు. ఆయన నా ఇష్ట నటుడు. అమితాబ్ గుర్తొస్తే, నాకు జంపు శీను గుర్తొస్తాడు. ఆరడుగుల మనిషి. పొడవుగా ఉన్న వాళ్లని జంపుగా ఉన్నాడని రాయలసీమలో అంటారు. వాడు అమితాబ్ పిచ్చోడు. ఎంతంటే క్రాప్ దగ్గర నుంచి బట్టలు, బూట్లు వరకు అనుకరించేంత.
టెన్త్‌లో నేను 70 శాతం మార్కులతో పాసయ్యాను. ఆ రోజుల్లో స్టేట్ ఫస్ట్ 82శాతం మార్కులే. అందరిలాగే నేను ఇంజనీరింగ్ వలలో చిక్కుకుని MPC చేరాను. అసలే లెక్కలు రావు, దానికి తోడు ఇంగ్లీష్ మీడియం. అదనంగా సినిమా పిచ్చి. ఇంటర్ ఫెయిల్. అక్కడితో నన్ను వదలకుండా పాలిటెక్నిక్‌లో చేరమన్నారు. దేనికి మార్కెట్ ఉంటే అదే గొప్ప విద్య. ఇంటర్ కంటే పాలిటెక్నిక్ ఇంకా నరకం. ఆటోమొబైల్స్‌లో 3 సెమిస్టర్లు అతి కష్టం మీద ఈదాను. ఇంజన్లు నా సబ్జెక్ట్ కాదని అర్థమైంది. ఇప్పటికీ నాకు స్కూటర్, కారు ఎలా పని చేస్తాయో తెలియదు. బొంబాయిలో తప్పి పోయిన గొర్రెల కాపరిలా అయిపోయింది నా బతుకు. అతి కష్టం మీద పాలిటెక్నిక్ వదిలించుకున్నాను. ఇంటా బయటా అవమానాలు.
ఈ పరిస్థితుల్లో శీను తగిలాడు. వాడూ పాలిటెక్నిక్ డ్రాపవుట్. ఇద్దరికీ అమితాబ్ సినిమాల పిచ్చి. సిగరెట్లు అలవాటయ్యాయి. వాడి ప్రత్యేకత ఏమంటే తానే అమితాబ్ అనుకునే వాడు. ఒకసారి లావరిస్ సినిమా చూస్తూ వుంటే ఏడ్వడం స్టార్ట్ చేశాడు. అమితాబ్ లాగే (సినిమాలో) తాను అనాథని అన్నాడు. మాకు మైండ్ పోయింది.
ఆ రాత్రికి బీర్లు తాగి కథ స్టార్ట్ చేశాడు. నార్త్ ఇండియాలో చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోతే ప్రస్తుత అమ్మానాన్న తెచ్చి పెంచుకున్నారని అన్నాడు. మేము బాధతో ఓదార్చాం. అమితాబ్ లాగే గాజు గ్లాస్‌ని చేత్తో పగల గొట్టాలని చూశాడు. అదృష్టం కొద్ది వీడికి శక్తి చాలక పగల్లేదు. లేదంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే డబ్బులు లేవు. లావరిస్ సినిమా ఆడినంత కాలం వాడిని ఓదార్చడమే పని. ఇదంతా కట్టు కథ అని కనిపెట్టడానికి కొంచెం టైం పట్టింది.
ఈ లోగా కొత్త కథ ఎత్తుకున్నాడు. బెంగళూరులో ఒకమ్మాయిని లవ్ చేశానని, అవసరమైతే అమ్మాయి అన్నని హత్య చేసైనా సరే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. భయపడి చచ్చాం. ఆ అమ్మాయిని చూపిస్తానని బెంగళూరు తీసుకెళ్లాడు (డబ్బులు మావే). నాతో సహా ఇంకో ఇద్దరు. మొత్తం నలుగురు. ఎలహంకలో వాళ్ల అన్న ఉండేవాడు. హౌసింగ్‌బోర్డులో ఇల్లు. ఆ రోజుల్లో అదో పల్లెటూరు. టెంట్ కూడా ఉండేది. సిటీ బస్సు కోసం కిలోమీటర్ నడక.
శీను వాళ్ల అన్న వూళ్లో లేడు. స్వేచ్ఛగా మకాం వేశాం. మధ్యాహ్నం సిటీ బస్సు ఎక్కాం. శీను మా లీడర్. నలుగురికి బదులు మూడు టికెట్లే తీసుకుని చెకింగ్ వాళ్లతో ఫైన్ వేయించాడు.
ఫస్ట్ టైం బెంగళూరు సిటీ చూసి కళ్లు తిరిగి పోయాయి. బ్రిగేడ్ రోడ్డులో చాప్లిన్ మాడ్రన్ టైమ్స్ చూశాం. రెండు రోజులు బెంగళూరులో ఉన్నా వాడి లవర్ కనిపించనే లేదు. ఎవరో ఒకమ్మాయిని చూపించాడు కానీ, ఆ పిల్ల వీడి మొహం కూడా చూడలేదు. అదీ కథేనని అర్థమైంది. అప్పటికి నాకు కథలు రాయడం రాదు. లేని పాత్రలతో అనేక సన్నివేశాలు సృష్టించడం శీనూనే నేర్పించాడు.
వాడు చెప్పిన అతి పెద్ద అబద్ధాల్లో ఒకటి క్లింట్ ఈస్ట్ వుడ్‌ని చూడడం. గుడ్‌బాడ్ అండ్ అగ్లీ సినిమా పిచ్చి తారాస్థాయిలో ఉన్న కాలం. (ఈ మధ్య ఒక సినిమా మేనేజర్ ఆ సినిమా టైటిల్ మ్యూజిక్‌ని రింగ్ టోన్‌గా పెట్టుకున్నాడు. నా దగ్గరికొచ్చి ఈ మ్యూజిక్ విన్నారా? అని అడిగాడు. చాలాసేపు నవ్వుకున్నాను)
క్లింట్ ఈస్ట్ వుడ్‌ని కూడా తన స్థాయికి దించి మరీ చెప్పాడు శీను. బెంగళూరులో ట్రక్ తోలుతూ క్లింట్ ఈస్ట్ వుడ్ వుంటే జనం వెంట పరుగెత్తుతున్నారట. మన వాడు కూడా పరుగెత్తి చూస్తే క్లింట్ కనిపించాడట. చెయ్యి ఊపితే, బదులు ఊపాడట.
కథలు చెప్పడం వాడి ఆర్ట్ అని గుర్తించలేనంత అజ్ఞానం నాది. అబద్ధాలు చెబుతున్నాడని దూరం పెట్టాం. 1985లో నేను యూనివర్సిటీలో చేరాను. 88లో తిరుపతిలో ఉద్యోగం. ఈ మధ్య కాలంలో వాడి గురించి తెలియదు.
1990లో పెళ్లి చేసుకున్నాడు. ఊహించినట్టుగానే నాకు పిలుపు రాలేదు. పెళ్లిలో కుర్తా, పైజామా వేసుకున్నాడట. ఆ రోజుల్లో పెళ్లంటే పంచె కట్టు మాత్రమే. మన వాడు స్పెషల్ కదా, ఇంట్లో గొడవ పడి మరీ పంచెని వ్యతిరేకించాడట.
పెళ్లి జరిగిన ఆరు నెలలకి రోడ్డు ప్రమాదంలో పోయాడు. బైక్ అతి వేగంగా నడిపే అలవాటు వాడికి. ఒకే ఒకసారి కూచున్నా. చచ్చిపోయాననే అనుకున్నా. మళ్లీ కూచోలేదు. ఒక స్నేహితుడి పెళ్లి పత్రికలు పంచడానికి కల్యాణదుర్గం వెళ్లాడు. వస్తూ ఒక ముసలమ్మని ఢీకొన్నాడు. ఆమెని ఒక జీపులో ఆస్పత్రికి తరలించారు.
ఒక ప్రమాదం చేసిన తర్వాత కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోకపోవడం శీను ప్రత్యేకత. మొదటి యాక్సిడెంట్ జరిగిన 10 నిమిషాలకే రెండో యాక్సిడెంట్. ఈ సారి ఆగి ఉన్న బస్సుని ఢీకొట్టాడు. పెండ్లి కొడుకుతో పాటు , వీడూ స్పాట్ డెడ్.
ఈ ప్రపంచంలో ఇమడలేని ఒక సర్రియాలిస్టిక్ స్వభావి. బతికున్నపుడు గుర్తు పట్టలేక పోయాను. ఇప్పుడు తరచూ గుర్తొస్తున్నాడు.