iDreamPost
iDreamPost
ఇవాళ బాక్సాఫీస్ చిన్న సినిమాల తాకిడితో తడిసి ముద్దయ్యింది. పదికి పైగానే ప్రేక్షకులను పలకరించేందుకు థియేటర్లలో అడుగు పెట్టాయి. అందులో అంచనాలు ఉన్న వాటిలో మొదటిది ముఖ చిత్రం. తారాగణం అంతగా పరిచయం లేనిదే అయినా ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడం, విశ్వక్ సేన్ లాయర్ గా ప్రత్యేక పాత్ర పోషించడం లాంటి కారణాలు అంచనాలు రేపాయి. కలర్ ఫోటోతో జాతీయ అవార్డు అందించిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి రచన చేయడం విశేషం. ప్రీమియర్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ముఖచిత్రంలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎలా ఉందో రిపోర్ట్ లో చూసేద్దాం
ప్లాస్టిక్ సర్జరీలో నిపుణుడైన డాక్టర్ రాజ్ కుమార్(వికాస్ వశిష్ట)చూడగానే మహతి(ప్రియా వడ్లమాని)ని ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటాడు. కానీ రాజ్ ను చిన్నప్పటి నుంచే ప్రేమిస్తున్న మాయ(అయేషా ఖాన్)కు వీరి వివాహం నిరాశ కలిగిస్తుంది. అనూహ్యంగా ఒకే రోజు జరిగిన యాక్సిడెంట్ లో మహతి చనిపోగా మాయకు తీవ్ర గాయాలై గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. దీంతో రాజ్ మహతి మొహాన్ని మాయకు అమర్చి ఆమె బ్రతికే ఉన్నట్టు అందరినీ నమ్మిస్తాడు. కానీ తర్వాత మాయకు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఇంతకీ మహతి మరణాన్ని దాచిపెట్టే అవసరం రాజ్ కు ఎందుకు వచ్చింది, వ్యవహారం కోర్టుకు ఎందుకు వెళ్ళింది లాంటివి తెరమీదే చూడాలి
ఇది ఒక నిజ జీవిత ఘటనను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నారు. పాయింట్ లో కొత్తదనం ఉంది. అంతే కాదు పెళ్ళయాక బయటికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్న మహిళల తీవ్రమైన సమస్యను ఇందులో డీల్ చేసిన తీరు సున్నితంగా మాత్రమే కాక ఆలోచింపజేసేలా ఉంది. విశ్వక్ సేన్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదించినా రెండో సగం పరుగులు పెట్టింది. థ్రిల్ తో పాటు సరిపడా ట్విస్టులు ఇచ్చారు. పెద్దగా అనుభవం లేకపోయినా ఆర్టిస్టుల నుంచి దర్శకుడు గంగాధర్ మంచి అవుట్ ఫుట్ రాబట్టుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలు రావడం లేదని ఫిర్యాదు చేసే ప్రేక్షకులకు రొటీన్ లవ్, మాస్, సైకో కిల్లింగ్స్ కి దూరంగా ముఖచిత్రం ఒక చక్కని అనుభూతిని కలిగిస్తుంది