iDreamPost
android-app
ios-app

“అలీబాబా” జాక్‌మాను వెనక్కు నెట్టిన ముఖేష్‌ అంబానీ..

“అలీబాబా” జాక్‌మాను వెనక్కు నెట్టిన ముఖేష్‌ అంబానీ..

ఆసియా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ముఖేష్‌ అంబానీ, జాక్‌మా మధ్య నంబర్‌ గేమ్‌ కొనసాగుతోంది. సంపదలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. గత నెలలో ఆసియా కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మాను వెనక్కు నెట్టి ముఖేష్‌ అంబానీ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నారు. బుధవారం సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. రిలయన్స్‌ అనుబంధ సంస్థ జియోలో 43,574 కోట్ల పెట్టుబడి పెట్టడంతో రిలయన్స్‌ షేరు భారీగా పెరిగింది. దీంతో అంబానీ సంపద ఒక్కసారిగా 4.7 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 49.2 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది జాక్‌మా కన్నా 3.2 బిలియన్‌ డాలర్లు అధికం. దీంతో అగ్రస్థానాన్ని ముఖేష్‌ మళ్లీ పొందారు.

గత నెలలో కరోనా భయాలు, ముడిచములు ధరల పతనంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. 30 ఏళ్ల కనిష్ట స్థాయిలో ముడిచమురు ధనలు పడిపోయాయి. రిలయన్స్‌ షేర్లు సైతం 12 శాతం పతనమయ్యాయి. దీంతో అంబానీ నికర ఆదాయం దాదాపు 580 కోట్ల డాలర్లు(5.8 బిలియన్‌ డాలర్లు) తుడిచిపెట్టుకుపోయింది. ఆ నేపథ్యంలోనే జాక్‌మా 44.5 బిలియన్‌ డాలర్ల అధిక సందతో నంబర్‌ వన్‌కు చేరారు. అంతకుముందు 2018లో ఆసియాలో నంబర్‌ వన్‌ స్థానాన్ని కోల్పోయిన తర్వాత ఈ ఏడాదే జాక్‌మా మొదటి స్థానానికి చేరుకున్నారు. అయితే నెల రోజుల్లోనే మళ్లీ ముఖేష్‌ అంబానీ మొదటి స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఫేస్‌బుక్‌తో జరిగిన డీల్‌ తర్వాత జియో ఫ్లాట్‌ఫామ్స్‌ విలువ 4.62 లక్షల కోట్లకు చేరింది.