iDreamPost
iDreamPost
చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ మునుగోడు ఉప ఎన్నికపై పడింది. అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఆశలను ఈ వ్యాఖ్యలు బాగా దెబ్బతీశాయి. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ క్షమాపణ చెప్పారు. కాని, రేవంత్ క్షమాపణలను తాను పట్టించుకోనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. తనను తిట్టిన అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబడ్డారు. అంతేకాదు, సస్పెన్షన్ తర్వాతే రేవంత్ క్షమాపణపై స్పందిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పారు.
పరిస్థితి తీవ్రతను అర్ధంచేసుకున్న అద్దంకి దయాకర్ శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. ‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. క్రమశిక్షణ కమిటీ నాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. నోటీసులకు వివరణ ఇచ్చాను. క్షమాపణ కూడా చెప్పా. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాను’ అని అద్దంకి దయాకర్ చెప్పినా, కోమటిరెడ్డి అంత తేలిగ్గా వదిలేలాలేరు. ఈ వివాదం ఆసరగా, కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకోవడానికే సిద్ధమవుతున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. దీనికితోడు రాజగోపాల్ రెడ్డికూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటారన్న వ్యాఖ్య వెనుక అర్ధం ఇదేనని అంటున్నారు. మొత్తానికి అద్దంకి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నాయకత్వానికే ఎసురుపెట్టాయి.